పక్కా ప్రణాళికతో ఆజ్యం పోస్తున్న అయ్యన్న
డిమాండ్ల చిట్టా విప్పుతున్న కొణతాల వర్గం
వ్యూహాత్మకంగా లీకులు మంత్రి గంటా వర్గానికి షాక్
విశాఖపట్నం: అనుకున్నంతా అవుతోంది. కొణతాల వర్గం ప్రభావం టీడీపీ వర్గవిభేదాల చిచ్చును మరింతగా రాజేస్తోంది. ఇంకా అధికారికంగా టీడీపీలో చేరకుండానే కొణతాల వర్గం తమ మనసులో మాట బయటపెట్టింది. వచ్చే ఎన్నికల్లో యలమంచిలి, పెందుర్తి ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీ టిక్కెట్లు తమవేనని వ్యూహాత్మకంగా వెల్లడించింది. అయ్యన్న తెరవెనుక ఉండి ఆడిస్తున్న ఈ రాజకీయ నాటకం గంటా వర్గంలో కలవరం రేకెత్తిస్తోంది. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తీవ్రంగా స్పందించగా... మంత్రి గంటా ఆత్మరక్షణలో పడ్డారు.
వ్యూహాత్మకం: కొణతాల వర్గం పార్టీలో చేరినా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న గంటా వర్గానికి తాజా పరిణామం షాక్ ఇచ్చింది. రానున్న ఎన్నికల్లో యలమంచిలి టిక్కెట్టు గండి బాబ్జీదేనని కొణతాల వర్గం వ్యూహాత్మకంగా లీకులిచ్చింది. మునగపాకలో నిర్వహించిన సమావేశంలో కొణతాల రఘునాథ్ మాట్లాడుతూ గండి బాబ్జీ వస్తేనే యలమంచిలి సమస్యలు పరిష్కారమవుతాయని వ్యాఖ్యానిచండం ప్రాధాన్యం సంతరించుకుంది. గంటా వర్గంలో కీలకమైన పంచకర్ల రమేష్‌బాబు ప్రస్తుతం యలమంచిలి ఎమ్మెల్యేగా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్టు దక్కదని కొణతాల వర్గం చెప్పకనే చెప్పింది. ఈ పరిణామంతో పంచకర్ల రమేష్‌బాబే కాదు మొత్తం గంటా వర్గం బిత్తరపోయింది. పంచర్ల ఎదురుదాడికి దిగారు. అసలు పార్టీలో చేరకుండానే యలమంచిలి టిక్కెట్టు తమదేనని కొణతాల వర్గం ఎలా చెబుతుందని ప్రశ్నించారు. దీనిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యలమంచిలి నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీ శ్రేణులకు భవిష్యత్తు రాజకీయాలపై ఉప్పందింది.
జాబితా ఇంకా పెద్దదే....
మంత్రి గంటా వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు మంత్రి అయ్యన్న పక్కా ప్రణాళిక అమలుచేస్తున్నారు. చక్రం తిప్పుతున్నారు. తాను తెరపైకి రాకుండా కొణతాల వర్గంతో కథ నడిపించాలని ఆయన ఎత్తుగడ వేశారు. వ్యూహాత్మకంగా పెందుర్తి, యలమంచిలి అసెంబ్లీ స్థానాలతోపాటు అనకాపల్లి ఎంపీ స్థానాన్ని టార్గెట్ చేస్తున్నారు. గండి బాబ్జీ రాకను పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో గండి బాబ్జీ పెందుర్తి మీద కాకుండా మరో నియోజకవర్గంపై కన్నేశారనే లీకులు ఇచ్చింది. తద్వారా ఎమ్మెల్యే బండారును ప్రస్తుతానికి చల్లబర్చవచ్చన్నది అయ్యన్న వర్గం వ్యూహం. కానీ వాస్తవానికి పెందుర్తి, యలమంచిలి రెండు నియోజకవర్గాల్లో తమ వర్గాన్ని బలోపేతం చేయడానికి పావులు కదుపుతోంది. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కూడా కొణతాల వర్గం నుంచి పార్టీలో చేరేవారికే వచ్చేలా చేయాలన్నది అయ్యన్న వ్యూహం. ఎందుకంటే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కొణతాల వర్గం, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణల మధ్య పూర్తి సఖ్యత ఉంది. ఆ రెండు కుటుంబాల మధ్య వివాహ బంధం ఏర్పడనుంటమే ఇందుకు కారణం. దాంతో గంటా వర్గం నుంచి పెందుర్తి, యలమంచిలి స్థానాలు, అనకాపల్లి ఎంపీ స్థానాన్ని లాక్కోవాలని అయ్యన్న వ్యూహరచన చేశారు.
గంటా వర్గం తర్జన భర్జన
తాజా పరిణామాలతో గంటా వర్గం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుతానికి యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఎదురుదాడి చేశారు. కానీ అయ్యన్న వర్గం పక్కా వ్యూహంతో వెళుతుండటంతో ఏంచేయాలన్నదానిపై మంత్రి గంటా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. తమ వర్గం నుంచి అనకాపల్లి ఎమ్మెల్యే జారుకున్నారు. పాకయరావుపేట ఎమ్మెల్యే అనిత కూడా కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు బండారు, పంకచర్ల, ఎంపీ అవంతి శ్రీనివాస్‌లకు వారి నియోజకవర్గాల్లోనే పొగ బెడుతున్నారు. దాంతో తాము ఎలా ఎదురుదాడి చేయాన్నదానిపై మంత్రి గంటా తమవర్గీయులతో తీవ్రంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గ పోరు మరిన్ని ఆసక్తికర మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.
రగిలే జ్వాల!
Published Tue, Jan 5 2016 11:19 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement