యువరాజునే నమ్ముకుంటే ఇక అంతే..!
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మళ్లీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారనగానే కాంగ్రెస్ సీనియర్లు పెదవివిరుస్తున్నారు. మూడు, మూడున్నర నెలల వ్యవధిలోనే యువరాజు మళ్లీ ఇక్కడకు రావడమేమిటా అని వారు నిట్టూరుస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజాసమస్యలపై, అధికారపక్షం వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాడి ప్రజల మనసులను గెలుచుకోవాల్సింది పోయి రాహుల్‌గాంధీ వచ్చి ఏదో అద్భుతం చేస్తారనుకుంటే ఎలా అని వాపోతున్నారట. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వెల్లడవుతున్న అసంతృప్తిని కాంగ్రెస్‌కు అనుకూలంగా మలుచుకునేందుకు రాష్ట్రనాయకులు వ్యూహాన్ని రచించకుండా రాహుల్‌గాంధీ తన పర్యటనలతో ఏదో మాయచేసేస్తాడని నమ్ముకుంటే ఎట్లా అని తమలో తాము గుసగుసలాడుకుంటున్నారట.
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు, అంతకుముందు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళితే ఏమాత్రం ఓట్లు వచ్చాయి, ఆయా ప్రాంతాల ప్రజలను ఏమాత్రం ప్రభావితం చేశారో రాష్ట్రముఖ్యనాయకులు గుర్తుచేసుకుంటే మంచిదని సలహాలు కూడా ఇస్తున్నారట. పార్టీని బలోపేతం చేసుకోవడం, కేడర్‌లో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపి సొంతబలాన్ని పెంచుకోవడం ద్వారానే రాష్ట్రంలో పార్టీ పునర్‌వైభవాన్ని సాధించగలదే తప్ప యువరాజ్ మ్యాజిక్‌ను నమ్ముకుంటే ఇక అంతేనని తేల్చేస్తున్నారట...