ప్రభుత్వాన్నైనా త్యాగం చేస్తాం
దాద్రీ బాధ్యులపై కఠిన చర్యలు: ములాయం
ఓ పార్టీకి చెందిన ముగ్గురుఈ కుట్ర చేశారు
ముజఫర్‌నగర్ అల్లర్లకూ వారే కారణం
మతతత్వ శక్తుల ఆటలు సాగనీయబోమని వ్యాఖ్య
లక్నో: గోమాంసం తిన్నారనే ఆరోపణతో మహమ్మద్ ఇఖ్లాక్ అనే వ్యక్తిని హత్యచేసిన ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అవసరమైతే యూపీలో తమ ప్రభుత్వాన్ని సైతం త్యాగం చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘దాద్రీ ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర. బాధ్యుల పేర్లు త్వరలోనే బయటకు వస్తాయి.
నాకున్న సమాచారం మేరకు ఒక పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ దారుణ హత్య వెనుక ఉన్నారు. పార్టీ బృందాన్ని దాద్రీకి పంపుతాం. అప్పుడు ఆ ముగ్గురు ఎవరనేది వెల్లడవుతుంది. బాధ్యులను గుర్తించగానే కఠిన చర్యలు చేపడతాం. ప్రభుత్వం నుంచి ఏ త్యాగమైనా చేస్తాం. అవసరమైతే మా ప్రభుత్వాన్నే త్యాగంచేస్తాం.’ అని ములాయం పేర్కొన్నారు. కాగా బిషదా గ్రామంలో ఐదు తరాలుగా నివసిస్తున్నామని, అక్కడి నుంచి తాము శాశ్వతంగా వలస వెళ్లిపోయే ఆలోచనేమీ లేదని ఇఖ్లాక్ సోదరుడు జమీల్ చెప్పారు. ఇక దాద్రీ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లను వ్యాపింపజేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.