మాంసంతో బియ్యం తయారు చేయడం ఏంటిదీ! అనిపిస్తుంది కదూ. మీరు వింటుంది నిజమే గొడ్డు మాంసంతో సరికొత్త వరి వంగడాన్ని సృష్టించారు శాస్త్రవేత్తలు. రానున్న కాలంలో ఎదురయ్య ఆహార సమస్యను ఈ సరికొత్త వంగడం తీరుస్తుందని చెబుతున్నారు. చూస్తే బియ్యపు గింజల్లానే ఉంటాయట. తింటే మాత్రం మాంసం రుచిని పోలి ఉంటుందని చెబుతున్నారు. ఏంటా వరి వండగం? ఎలా తయారు చేశారంటే..
దక్షిణ కొరియాలోని యోన్సీ విశ్వవిద్యాలయ పరిశోధకులు బృందం ఈ సరికొత్త బీఫ్ హైబ్రిడ్ వరి వంగడాన్ని సృష్టించారు. వాళ్లు సృష్టించిన బియ్యపు గింజల్లో గొడ్డు మాంసంలో ఉండే కొవ్వు కణాలు ఉంటాయి. చూడటానికి గులాబీ రంగులో ఉంటాయి ఈ బియ్యం. ఫిష్ జెలటిన్‌లో సాంప్రదాయ బియ్యం గింజలను కప్పి, వాటిని అస్థిపంజర కండరం కొవ్వు మూలకణాలతో ప్రయోగాత్మకంగా ల్యాబ్‌లో సాగు చేశారు. అలా తొమ్మిది నుంచి 11 రోజుల పాటు కండరాలు, కొవ్వు, జెలటిన్-స్మోటెర్డ్ బియ్యాన్ని సాగు చేసిన తర్వాత, ధాన్యాలు అంతటా మాంసం, కొవ్వును ఉంటాయి. చివరిగా ఉత్పత్తి అయ్యే వరి వంగడం మంచి పౌష్టికరమైన బియ్యంగా మారుతుంది.
ప్రయోగశాలలో తయారు చేసిన ఈ గొడ్డు మాంసం కల్చర్డ్ రైస్‌ను ప్రోఫెసర్ జింకీ హాంగ్ వండి రుచి చూశారు. చూడటానికి సాధారణ బియ్యం వలే గులాబీ రంగులో ఉంటాయి. కానీ మాంసపు లక్షణాన్ని కలిగి ఉందన్నారు. సువాసన కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ హైబ్రిడ్ బియ్యం కొంచెం దృఢంగా పెళుసుగా ఉందని అన్నారు. అయితే ఇందులో 8% దాక ప్రోటీన్, 7% కొవ్వులు ఉంటాయని అన్నారు. ఈ బియ్యం గొడ్డు మాంసం, బాదం వంటి వాసనను కలిగి ఉంటుందన్నారు. వండిన తర్వాత వెన్న, కొబ్బరి నూనె కూడిన వాసన వస్తుందన్నారు.
ఈ వరి వంగడాన్ని సృష్టించడానికి కారణం..
ఒకవైపు వనరులు తగ్గిపోతున్నాయి, మరోవైపు పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఆ అవసరాలను తీర్చడం కోసం ఈ సరికొత్త వరి బియ్యాన్ని సృష్టించే ప్రయోగాలు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా జంతువుల నుంచి మనకు అవసరమైన ప్రోటీన్‌ను అందుతుంది. అయితే జంతువులను పెంచడానికి చాలా వనరులు అవసరం. ఇది ఒకరకంగా వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువు విడుదలను పెంచుతుంది. అలాగే వరి పండించటానికి ఎక్కువ నీరు, శ్రమ అవసరం అవుతాయి. బదులుగా తక్కువ శ్రమతో తక్కువ వనరులను ఉపయోగించి ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ కలయికలో ఆహారం ఉంటే అది అందరికీ వెసులుబాటుగా ఉంటుందన్నారు. అంతేగాదు ఈ సెల్-కల్చర్డ్ ప్రోటీన్ రైస్ నుంచి మనకు అవసరమైన అన్ని పోషకాలు పొందడం గురించి కూడా పరిశోధన చేయాల్సి ఉందన్నారు.
పరిశోధకులు స్థానిక వధశాలలో వధించిన హన్వూ పశువుల నుంచి కండరాలు, కొవ్వు కణాలను తీసుకుని ఈ సరికొత్త వరి వండగాన్ని సృష్టించారు. ఇలా ఎక్కువ జంతువులు అవసరం లేకుండా ల్యాబ్‌లో నిర్వహించగల జంతు కణాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.ఈ ప్రయోగంలో మరిన్ని మార్పులు చేసి.. చేపల వంటి వాటిని కూడా వినియోగించి వివిధ రుచులగల ఆహారాన్ని తయారు చేసే దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు.
అయితే ఈ హైబ్రిడ్ బియ్యం అచ్చంగా మాంసం రుచిని పోలీ ఉంటాయి కాబట్టి మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రజలు వీటిని ఇష్టపడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదీఏమైనా ఈ సరికొత్త వరి వంగడం భవిష్యత్తులో కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు మంచి ఆహార వనరుగా ఉంటుంది. అలాగే సైనికులకు అవసరమైన పౌష్టికాహారంగానూ, అంతరిక్ష ఆహారంగానూ పనిచేస్తుందని పరిశోధకులు నమ్మకంగా చెబుతున్నారు. చెబుతున్నారు.
(చదవండి: 1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!)
Comments
Please login to add a commentAdd a comment