
ఏపీ: 2019లో ఒంటరిగా తలపడతాం
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అన్ని నియోజకవర్గాల్లోనూ సొంతంగా పోటీ చేయబోతున్నట్లు..
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టీకరణ
తంబళ్లపల్లె(చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అన్ని నియోజకవర్గాల్లోనూ సొంతంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు చెప్పారు. చిత్తూరు జిల్లా ములకలచెరువులో బుధవారం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు మదనపల్లెలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
బీజేపీని దేశంలో నలమూలలకు తీసుకెళ్లేందుకు ప్రధాని కృషి చేస్తున్నారని, ఏపీతోపాటు కర్ణాటకలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు మురళీధర్ రావు చెప్పారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తమ పార్టీ పుంజుకుంటోందని చెప్పారు. దేశంలో నల్లధనం రాజకీయాలకు సమాధి కట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
అనంతరం జాతీయ కిసాన్‌మోర్చా అధికార ప్రతినిధి చల్లపల్లె నరసింహారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి బీజేపీయే కారణమని గుర్తు చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను టీడీపీ నాయకులు జేబుల్లో నింపుకుంటున్నారన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గానికి మంజూరైన పనులను పక్క జిల్లా నాయకులకు 20 శాతం కమీషన్‌తో అమ్ముకున్నారని ఆరోపించారు.