70 ఏళ్ల తర్వాత మొదటిసారి...
అట్లాంటా: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో కెల్లీ జిస్సెండనర్(47) అనే మహిళకు బుధవారం మరణశిక్ష అమలు చేశారు. జాక్సన్ నగరంలోని డయాగ్నోస్టిక్ అండ్ క్లాసిఫికేషన్ కారాగారంలో ఆమెకు విషపు ఇంజక్షన్ చేసి మరణశిక్ష అమలు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. జార్జియాలో 70 ఏళ్ల తర్వాత మహిళకు మరణశిక్ష అమలు చేయడం ఇదే మొదటిసారి అని స్థానిక మీడియా వెల్లడించింది.
తన భర్తను హత్య చేసిన కేసులో కెల్లీ జిస్సెండనర్ కు కోర్టు మరణశిక్ష విధించింది. ఆమె భర్త డాగ్లస్ 1997లో హత్యకు గురయ్యాడు. కెల్లీ జిస్సెండనర్ కు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని ఆమె తరపు న్యాయవాదులు మూడుసార్లు ఫెడరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. పోప్ లేఖ రాసినా ఆమెకు మరణశిక్ష తప్పలేదు.
చనిపోయే ముందు కెల్లీ జిస్సెండనర్ పశ్చాత్తాపం వ్యక్తం చేసిందని ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. తన కారణంగా చనిపోయిన భర్తకు క్షమాపణ చెప్పింది. మంచి కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకుంది.