రంజాన్ సందర్భంగా దుబాయ్ లో అనూహ్య నిర్ణయం!
దుబాయ్: మధ్యప్రాచ్యానికి చెందిన ప్రఖ్యాత ఎడారి దేశం దుబాయ్ లో రంజాన్ పర్వదినం సందర్భంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రంజాన్ సందర్భంగా పగటిపూట మద్యాన్ని అమ్మకూడదన్న నిబంధనలను తాజాగా సడలిస్తూ దుబాయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రంజాన్ నెలలో మద్యం అమ్మకాల నిబంధనలను సడలించడం దుబాయ్ లో తొలిసారి కావడం గమనార్హం.
గతంలో రంజాన్ సందర్భంలో మద్యం కొనుగోలు చేయాలంటే సూర్యాస్తమయం అయ్యేవరకు వేచిచూడాల్సి వచ్చేది. ముస్లింలు రంజాన్ ఉపవాసాన్ని నీటితో విరమించి.. ఇఫ్తార్ విందు స్వీకరించిన అనంతరమే మద్యం అమ్మకాలు జరిపేవారు. ముస్లింలకు పవిత్రమైన మాసం కావడంతో దుబాయ్ లోని బార్లు, హోటళ్లలో రాత్రిపూట రహస్యంగా మాత్రమే మద్యం అమ్మకాలు జరిగేవి.
అయితే, తాజాగా దుబాయ్ పర్యాటక, వాణిజ్య మార్కెటింగ్ విభాగం.. పర్యాటకులు, మద్యం అమ్మకాలపై వచ్చే పన్ను ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎమిరెట్స్ అంతటా ఉన్న హోటళ్లు, బార్లకు ఓ నోటీసు జారీ చేసింది. మే 31న జారీచేసిన ఈ నోటీసులో రంజాన్ మాసంలోనూ మద్యం అమ్మకాల విషయంలో సాధారణ నిబంధనలే వర్తిస్తాయని, గతంలో మాదిరిగా పరిమిత సమయంలోనే అమ్మకాలు జరుపాలన్న నిబంధనలు ఉండబోవని తెలియజేసింది. ఈ నోటీసు ప్రతిని సంపాదించిన మీడియా.. దీని గురించి దుబాయ్ పర్యాటక, వాణిజ్య మార్కెటింగ్ విభాగాన్ని వివరణ కోరగా.. ప్రపంచస్థాయి పర్యాటక స్థలంగా ఉన్న దుబాయ్ కి వచ్చే పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఈ నోటీసు జారీచేసినట్టు తెలిపింది.