Mideast
-
ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక.. పశ్చిమాసియాలో సైనిక విస్తరణ
న్యూయార్క్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌కు హెచ్చరికగా అగ్రరాజ్యం అమెరికా చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ డెస్ట్రాయర్లు, దీర్ఘ-శ్రేణి బీ-52 బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా అదనపు సైనిక పరికరాలు మోహరిస్తున్నట్లు అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇదొక హెచ్చరిక అని పేర్కొంది."ఇరాన్.. ఆదేశ అనుబంధ మిలిటెంట్ గ్రూపులను అమెరికన్ సిబ్బంది లేదా మిత్రదేశాల ప్రాంత ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవడానికి వినియోగిస్తే అమెరికా సైతం మా ప్రజలను రక్షించుకునేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటుంది. మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా అదనపు సైనిక, రక్షణ వనరులను విస్తరిస్తాం. గత నెల చివరిలో మోహరించిన THAAD క్షిపణి రక్షణ వ్యవస్థతో సహా అమెరికా సైన్యం నిర్వహిస్తుంది. అదనపు సైన్యం.. రాబోయే నెలల్లో రావడం మొదలవుతుంది’’ అని పెంటగాన్ ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. అక్టోబరు 26న ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులతో విరుచుకుపడింది. కీలకమైన సైనిక, ఆయిల్ స్థావరాల మౌలిక సదుపాయాలను నాశనం చేసింది. మరోవైపు.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇరాన్.. ఇజ్రాయెల్‌పై రెండుసార్లు మిసైల్స్‌తో దాడులకు దిగింది. ఏప్రిల్‌లో డమాస్కస్‌లోని తన కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఇరాన్.. ఇజ్రాయెల్ దాడి చేసింది. తమ దేశం మద్దతు ఇస్తున్న మిలిటెంట్ గ్రూప్ నేతల హత్యకు ప్రతిస్పందనగా అక్టోబర్‌లో మరోసారి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే.చదవండి: ఇజ్రాయెల్ హై అలర్ట్.. ఇరాన్ ప్రతీకార దాడి చేస్తుందని అనుమానం -
ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా.. ఇప్పుడు ప్రపంచంలోని అద్భుతాలకు..
దుబాయ్: ఎనిమిదేళ్ల పాటు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన దుబాయ్‌లోని వరల్డ్ ఫెయిర్ (అంతర్జాతీయ ఎగ్జిబిషన్) ఎట్టకేలకు పూర్తయింది. ఒకప్పుడు ఇసుకతో ఎడారిగా కనిపించిన ప్రదేశం ఇప్పుడు ప్రపంచంలోని నలుమూలల ఉన్న అద్భుతాలకు నమూనాలను రూపొందించి కన్నుల విందుగా మారింది. మొత్తం 190 దేశాలకు సంబంధించిన పెవిలియన్స్ (విభాగాలు) ఇందులో ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఏర్పాటైన తొలి అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌గా ఇది రికార్డులకెక్కింది. మొత్తం 1080 ఎకరాల్లో నిర్మించిన ఈ ఎగ్జిబిషన్ దాదాపు ఆర్నెళ్ల పాటు దేశవిదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించనుంది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రెప్లికా, అమెరికా మూడో అధ్యక్షుడు వాడిన ఖురాన్, ట్రాన్స్ఫార్మర్లా మారే చైనా కారు, 20 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లతో తయారైన 70 కిలోమీటర్ల ఇటలీ తాడు, మైఖెలాంజెలో చెక్కిన బైబిల్ హీరో డేవిడ్ త్రీడీ బొమ్మ వంటివి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. భవిష్యత్తులో చూడబోయే టెక్నాలజీల ప్రొటోటైప్‌లు కూడా ఇందులో ఉండనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటి వరకూ అమెరికా, యూరోప్ తప్ప మధ్యప్రాచ్యంలో ఎప్పుడూ ఈ ఎగ్జిబిషన్ నిర్వహించలేదు. చదవండి: (హవానా... అంతా భ్రమేనా?!) -
రంజాన్ సందర్భంగా దుబాయ్ లో అనూహ్య నిర్ణయం!
దుబాయ్: మధ్యప్రాచ్యానికి చెందిన ప్రఖ్యాత ఎడారి దేశం దుబాయ్ లో రంజాన్ పర్వదినం సందర్భంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రంజాన్ సందర్భంగా పగటిపూట మద్యాన్ని అమ్మకూడదన్న నిబంధనలను తాజాగా సడలిస్తూ దుబాయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రంజాన్ నెలలో మద్యం అమ్మకాల నిబంధనలను సడలించడం దుబాయ్ లో తొలిసారి కావడం గమనార్హం. గతంలో రంజాన్ సందర్భంలో మద్యం కొనుగోలు చేయాలంటే సూర్యాస్తమయం అయ్యేవరకు వేచిచూడాల్సి వచ్చేది. ముస్లింలు రంజాన్ ఉపవాసాన్ని నీటితో విరమించి.. ఇఫ్తార్ విందు స్వీకరించిన అనంతరమే మద్యం అమ్మకాలు జరిపేవారు. ముస్లింలకు పవిత్రమైన మాసం కావడంతో దుబాయ్ లోని బార్లు, హోటళ్లలో రాత్రిపూట రహస్యంగా మాత్రమే మద్యం అమ్మకాలు జరిగేవి. అయితే, తాజాగా దుబాయ్ పర్యాటక, వాణిజ్య మార్కెటింగ్ విభాగం.. పర్యాటకులు, మద్యం అమ్మకాలపై వచ్చే పన్ను ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎమిరెట్స్ అంతటా ఉన్న హోటళ్లు, బార్లకు ఓ నోటీసు జారీ చేసింది. మే 31న జారీచేసిన ఈ నోటీసులో రంజాన్ మాసంలోనూ మద్యం అమ్మకాల విషయంలో సాధారణ నిబంధనలే వర్తిస్తాయని, గతంలో మాదిరిగా పరిమిత సమయంలోనే అమ్మకాలు జరుపాలన్న నిబంధనలు ఉండబోవని తెలియజేసింది. ఈ నోటీసు ప్రతిని సంపాదించిన మీడియా.. దీని గురించి దుబాయ్ పర్యాటక, వాణిజ్య మార్కెటింగ్ విభాగాన్ని వివరణ కోరగా.. ప్రపంచస్థాయి పర్యాటక స్థలంగా ఉన్న దుబాయ్ కి వచ్చే పర్యాటకులను దృష్టిలో పెట్టుకొని ఈ నోటీసు జారీచేసినట్టు తెలిపింది.