గుంటూరు: ఇప్పటికిప్పుడు కళాశాలకు నిరవధిక సెలవులు ప్రకటిస్తే తాము ఎక్కడికి వెళ్లాలంటూ గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. కర్ణాటక, మణిపూర్, కేరళ, త్రిపుర, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాల విద్యార్థులు ఐసీఏఆర్ ద్వారా ఎంపికై బాపట్ల వ్యవసాయ కళాశాలలో చదువుకుంటున్నారు. ఇటీవల ఈ కళాశాలలో ఏజీ ఎమ్మెస్సీ విద్యార్థి ఎం.సూర్యారావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటనపై విచారణకు సంబంధించిన నివేదికను తమ సమక్షంలోనే తయారు చేసి యూనివర్సిటీకి అందించాలంటూ తోటి విద్యార్థులు పట్టుబట్టారు. అందుకు కమిటీ సభ్యులు నిరాకరించారు. దాంతో విద్యార్థులు గత నాలుగు రోజులుగా కళాశాల అతిథి గృహం ముందు ఆందోళన చేస్తున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి కళాశాలకు సెలవులు ప్రకటిస్తూ యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కళాశాలలోని హాస్టళ్లకు, మెస్‌కు తాళాలు వేయించారు. దూరప్రాంతాలకు చెందిన తాము ఇళ్లకు వెళ్లాలంటే ముందుగా ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని విద్యార్థులు తెలిపారు.
ఇప్పటికిప్పుడు సెలవు ప్రకటించి... ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోవాలని ఆదేశిస్తే తాము ఎక్కడికి వెళ్లాలి.. ఎలా వెళ్లాలంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ఆర్.కె.ప్రసాద్‌ను వివరణ కోరాగా యూనివర్సిటీ అధికారుల నిర్ణయం మేరకే తాము నడుచుకుంటున్నామని తెలిపారు. యాజమాన్యం ఏదీ చెబితే అది చేస్తామని ఆయన సమాధానం చెప్పారు.