మేరా భారత్ మహాన్ | Independence day celebrations in Andhrapradesh | Sakshi
Sakshi News home page

మేరా భారత్ మహాన్

Published Fri, Aug 16 2013 4:29 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

మేరా భారత్ మహాన్

మేరా భారత్ మహాన్

జాతీయ భావం...  సమైక్య వాదం మువ్వన్నెల  రెపరెపల నడుమ హోరెత్తిన నినాదం
 సాక్షి, నెట్‌వర్క్: మువ్వన్నెల పతాక రెపరెపలకు సమైక్య నినాదం శృతి కలిసింది. సమైక్యాం ధ్ర పరిరక్షణ లక్ష్యంగా ఉద్యమిస్తున్న సకలజనులు గురువారం స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూనే సమైక్యాంధ్ర ఆకాంక్షనూ ఎలుగెత్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగులు అధికారికంగా జరిగిన స్వాతంత్య్రదినోత్సవంలో పాల్గొనకుం డా అక్కడే వేరుగా జాతీయజెండా ఎగురవేశశారు. కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో ‘సమైక్యాంధ్రపై కవి సమ్మేళనం’ నిర్వహించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట, కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంవద్ద జాతీయ, సమైక్య పతాకాలను పక్కపక్కనే ఎగురవేశారు. ముమ్మిడివరంలో జేఏసీ నేతలు పెన్మత్స జగ్గరాజు, కోనా శ్రీనివాసరావు, బీవీఆర్ చౌదరిల ఆధ్వర్యంలో సమైక్యవాదులు గుండు గీయించుకుని నిరసన తెలిపారు.
 
 ఆరు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న మంత్రి  తోట నరసింహం సతీమణి వాణి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. కేంద్రమంత్రి దిగ్విజయ్‌సింగ్‌తోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ... ఫోన్లో మంత్రి తోట నర్సింహం, వాణితో మాట్లాడి దీక్షను విరమించాలని కోరారు. టీడీపీ కి చెందిన రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సీతానగరం కస్తూర్బా ఆశ్రమం ఎదుట గాంధీలా కర్ర చేత పట్టుకుని నిలబడి ఎనిమిది గంటలు దీక్ష చేశారు.  శ్రీకాకుళంలో స్వర్ణమంజరి అంధుల పాఠశాల విద్యార్థులు గాంధీ, నెహ్రూ, వివేకానందుడు, అల్లూరి సీతారామరాజు, తెలుగు తల్లి వేషధారణలతో ర్యాలీ తీశారు. జేసీస్ ఫెమీనా ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ కుండలతో ప్రదర్శన నిర్వహించారు. ఇచ్ఛాపురంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు బస్టాండ్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో జెండా వందనం సందర్భంగా సమైక్యాంధ్ర ఆవశ్యకతపై ఉద్వేగంగా మాట్లాడుతూ సర్పంచ్ మల్లిపెద్ది ధనలక్ష్మి స్పృహతప్పి పడిపోయారు.
 పాలకొల్లులో మూడోరోజూ బంద్ కొనసాగింది. తాడేపల్లిగూడెంలో విద్యార్థులు రాష్ర్ట చిత్రపటం ఆకారంలో కూర్చుని సమైక్యాంధ్ర కు మద్దతు తెలిపారు. విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో ఐక్య విద్యార్థి ఫ్రంట్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం జరిగింది. గోపాలపట్నంలో ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్‌లకు పెద్దకర్మ నిర్వహించారు. ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. అనకాపల్లిలో గుడ్ షెపర్డ్ విద్యార్థులు వెయ్యి అడుగుల భారీ పతాకాన్ని ప్రదర్శించారు. విజయనగరంలో ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక, న్యాయవాదుల సంఘం సభ్యులు, ఎన్జీఓలు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుంచి ఎత్తుబ్రిడ్జి వరకు ర్యాలీగా వెళ్లి రాజీవ్ విగ్రహం ఎదురుగా భారీ మానవహారం నిర్మించారు. పార్వతీపురంలో సమైక్యవాదులు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. చీపురుపల్లిలో ఆర్‌ఈసీఎస్ ఉద్యోగులు బైక్ ర్యాలీ, మూడురోడ్ల జంక్షన్‌లో మానవహారం నిర్వహించారు.
 
 వర్షంలోనూ సమైక్యం...: ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నా నెల్లూరు జిల్లాలో ఆందోళనకారులు ఉద్యమాన్ని కొనసాగించారు. నెల్లూరులో ఆర్‌టీసీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి వంటావార్పు, మానవహారం, ర్యాలీలు నిర్వహించారు. సూళ్లూరుపేటలో ఆందోళనకారులు జాతీయ జెండాకు బదులుగా సమైక్యాంధ్ర జెండాను ఎగురవేశారు. ప్రకాశం జిల్లా  కనిగిరిలో కనిగిరిలో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ప్రతిజ్ఞ బూనారు.

 

ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో శంకర్‌విలాస్‌సెంటర్, హిందూకళాశాల కూడలి, లాడ్జిసెంటర్ వద్ద కార్యకర్తలతో ప్రదర్శన, మానవహారం చేశారు. జిల్లాలో అన్నిచోట్లా వైఎస్‌ఆర్ సీపీ నేతలు రిలేదీక్షలకు కూర్చొన్నారు. చిలకలూరిపేటలో ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేశారు. తెనాలి, మంగళగిరి, మాచర్లలో వైఎస్సా ర్ సీపీ నేతలు ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మలను ఊరేగించారు. పలువురు ఎన్జీవోలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను తీసుకోలేదు. మున్సిపల్ ఉద్యోగులు విజయవాడలో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు రెండోరోజు కొనసాగుతున్నాయి.  జగ్గయ్యపేట, పెనుగంచిప్రో లు  మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. చిల్లకల్లులో గ్రామస్తులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. గంగూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన చేశారు.
 
 రెగ్యులర్ వైద్య సేవలు బంద్: అనంతపురంలో పంచాయతీరాజ్ జేఏసీ నేతృత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి మద్దతు పలికారు. ఈనెల 19 నుంచి జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని ఎస్కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రకటించారు. శుక్రవారం నుంచి అత్యవసర వైద్యసేవలు మినహా రెగ్యులర్ వైద్య సేవలను బంద్ చేస్తున్నామని వైద్య ఆరోగ్య జేఏసీ నాయకులు తెలిపారు.
 
 ధర్మవరంలో వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సమైక్యవాదం ఢిల్లీకి వినిపించేలా ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ విజయమ్మ విజయవాడలో చేపట్టనున్న దీక్షకు మద్దతుగా కళ్యాణదుర్గంలో వైఎసార్ కాంగ్రెస్ పార్టీ ట్రే డ్ యూనియన్ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. రాయదుర్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఎస్‌ఎస్ వలీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి సంఘీభావం తెలిపారు. కర్నూలులో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 15వ రో జూ కొనసాగాయి.  ఆత్మకూరులో జ్యువెలర్స్ అసోసియేషన్ చేపట్టిన రిలేదీక్షలకు వైఎస్సార్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండాతోపాటు నల్లజెండాను ఎగురవేసి నిరసన తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సమైక్యవాదులు కేంద్రమంత్రుల ఫొటోలను కుక్కలు, గుంటనక్కల రూపాల్లో చిత్రించి నిరసన తెలిపారు.
 
 విభజన ఆందోళనతో ఆత్మహత్య
 గుత్తి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయనే నిరాశతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని జక్కలచెరువుకు చెందిన మోహన్, రంగమ్మ  కుమారుడు రంగస్వామి (24) గ్రాడ్యుయేషన్ తరువాత ఐటీఐ చేశారు. విద్యుత్ సంస్థలో పోల్ టు పోల్ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ కొంతకాలం క్రితం ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి గ్రామంలో చిన్న చిన్న విద్యుత్ పనులు చేస్తుండేవాడు. రాష్ట్రం విడిపోతే మళ్లీ ఉద్యోగం రాదనే ఆందోళనతో గురువారం సూసైడ్ నోట్ రాసి.. గ్రామానికి సమీపంలోని పొలానికి వెళ్లి క్రిమి సంహారక మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement