చైనాకు వ్యతిరేకంగా భారత్ నన్ను వాడుకోలేదు!
న్యూఢిల్లీ: తన అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బౌద్ధమత గురువు దలైలామా స్పందించారు. చైనాకు వ్యతిరేకంగా భారత్ తననెప్పుడు వాడుకోలేదని ఆయన అన్నారు. టిబేట్ ప్రాంతానికి అర్థమంతమైన స్వయం పరిపాలన, స్వతంత్రతను చైనా అందించాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
'చైనాలో భారత్‌ను ప్రేమించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ కొంతమంది సంకుచిత దృక్పథం కలిగిన రాజకీయా నాయకులు నన్ను రాక్షసుడిగా చూస్తున్నారు' అని అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న దలైలామా బుధవారం మీడియాతో పేర్కొన్నారు. దౌత్యపరంగా చైనాను సవాల్ చేసేందుకే దలైలామాను భారత్ వాడుకుంటున్నదని ఆ దేశం చేస్తున్న వాదనను దలైలామా తోసిపుచ్చారు. 'భారత్‌కు నేను చాలా సుదీర్ఘకాలపు అతిథిని. నన్ను చైనాకు విరుద్ధంగా భారత్ వాడుకోలేదు' అని అన్నారు.
అరుణాచల్‌లో దలైలామా పర్యటనను వెంటనే నిలిపివేయాలని భారత్‌ను చైనా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ 'వివాదాస్పద ప్రాంతం'లో దలైలామా పర్యటనకు అనుమతించడం ద్వారా భారత్ తమతో సంబంధాలను చెడగొట్టుకునే సాహసం చేసిందని డ్రాగన్ మండిపడింది.