పెట్టుబడులకు స్వర్గధామం..! | India is darkness, light-ray of the international financial sector | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు స్వర్గధామం..!

Published Wed, Oct 7 2015 3:22 AM | Last Updated on Wed, Aug 15 2018 6:32 PM

పెట్టుబడులకు స్వర్గధామం..! - Sakshi

పెట్టుబడులకు స్వర్గధామం..!

చీకట్లో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక రంగానికి కాంతిరేఖ భారత్
♦ పన్నుల వ్యవస్థను, వ్యాపార ప్రక్రియను మరింత సరళీకరిస్తాం
♦ మేధో హక్కులను పరిరక్షిస్తాం
♦ ఇండో జర్మన్ బిజినెస్ లీడర్ల సదస్సులో ప్రధాని మోదీ
 
 బెంగళూరు: ‘ప్రపంచ ఆర్థిక రంగంలో చీకట్లు అలుముకున్న సమయంలో.. పెట్టుబడులకు వెలుగురేఖగా భారత్ నిలుస్తోంద’ని ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత్‌లో పెట్టుబడులకు, వ్యాపారాలకు ఇది సరైన సమయమని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే అంతర్జాతీయంగా ప్రముఖ వ్యాపార సంస్థల దృష్టిలో భారత్ విశ్వసనీయతను తిరిగి నిలబెట్టగలిగామన్నారు. బెంగళూరులో మంగళవారం నాస్‌కామ్ ఆధ్వర్యంలో జరిగిన ఇండోజర్మన్ బిజినెస్ సమ్మిట్‌లో జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌తో కలసి మోదీ పాల్గొన్నారు. సదస్సులో భారత్, జర్మనీలకు చెందిన ఐటీ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరళమైన పన్ను వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, మేధో హక్కులను పరిరక్షిస్తామని పెట్టబడిదారులకు మోదీ హామీ ఇచ్చారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టామని, సంబంధిత చట్టం 2016 నుంచి అమల్లోకి వస్తుందన్న విశ్వాసం తనకుందన్నారు. పెట్టుబడులకు, వ్యాపారాలకు అత్యంత అనువైన దేశంగా భారత్‌ను మార్చేందుకు తన ప్రభుత్వం చేపట్టిన, చేపట్టనున్న చర్యలను మోదీ వివరించారు. త్వరలో దివాళా నిబంధనావళిని రూపొందిస్తామని, కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నిజమైన పెట్టుబడిదారులకు, నిజాయితీ పరులైన పన్ను చెల్లింపుదారులకు పన్నుల విషయాల్లో సులభతరమైన విధానాన్ని అవలంబిస్తామన్నారు.

ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తరువాత చాన్నాళ్లుగా ఇన్వెస్టర్లలో నెలకొన్న భయాందోళనలను తొలగించామని తెలిపారు. ఎఫ్‌పీఐలపై కనీస ప్రత్యామ్నాయ పన్ను(ఎమ్‌ఏటీ)ను విధించబోమన్నారు. భారత్, జర్మనీ సంబంధాలు సామర్ధ్యానికి తగ్గ స్థాయిలో లేవన్న మోదీ.. జర్మనీ బలంగా ఉన్న రంగాల్లో తాము భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామన్నారు.మెట్రో రైల్, జాతీయ రహదారులు, 100 స్మార్ట్ సిటీలు, 5 కోట్ల ఇళ్లు, రైల్వేల అధునీకరణ.. తదితర అనేక రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపారాలకు భారత్‌లో అపార అవకాశాలున్నాయని, జర్మన్ కంపెనీలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని మోదీ కోరారు.

‘ప్రపంచవ్యాప్తంగా హార్డ్‌వేర్‌ను నడిపిస్తోంది భారత సాఫ్ట్‌వేర్.. అంతర్జాతీయ సాంకేతికతను సుసంపన్నం చేస్తోంది భారత దేశ సామర్ధ్యం..దేశదేశాల్లో ఉత్పత్తి వ్యవస్థకు స్ఫూర్తినిస్తోంది భారత మార్కెట్’ అని వ్యాఖ్యానించారు. సదస్సులో మోదీ, మెర్కెల్‌ల సమక్షంలో ఐదు బీ టూ బీ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

 ఇండో- ఈయూ ఫ్రీ ట్రేడ్ చర్చలు  పునఃప్రారంభం కావాలి
 సదస్సులో మెర్కెల్ మాట్లాడుతూ.. భారతీయ ఇన్వెస్టర్లను జర్మనీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. భారత్, యూరోపియన్ యూనియన్ల మధ్య ఫ్రీ ట్రేడ్ ఒప్పందానికి సంబంధించిన చర్చలను పునః ప్రారంభించాలన్నారు. జర్మనీ, భారత్‌ల మధ్య వాణిజ్యం 16 బిలియన్ యూరోలకు చేరిందని, ఈ సంవత్సరం అది మరింత పెరగాలని ఆకాంక్షించారు. 1,600లకు పైగా జర్మన్ కంపెనీలు భారత్‌లో క్రియాశీలకంగా ఉన్నాయని, వాటిలో కొన్ని వందేళ్లకు పైగా భారత్‌లో సేవలందిస్తున్నాయన్నారు.

 ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జీ 4 దేశాలుగా భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. టర్కీలో ఈ నవంబర్‌లో జరిగే జీ 20 దేశాల సదస్సు సందర్భంగా మరోసారి మోదీతో భేటీ అయ్యే అవకాశం తనకు లభిస్తుందన్నారు. అంతకుముందు, ఇరువురు నేతలు బెంగళూరులోని జర్మన్ ఆటోమోటివ్ సంస్థ బాష్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భారత్‌లో 2015లో రూ. 650 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు బాష్ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement