
దావూద్‌ను ఎందుకు చంపలేదు ?
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఆ గడ్డపైనే హతమార్చేందుకు భారత ప్రభుత్వం కోవర్ట్ ఆపరేషన్‌కు ఎప్పుడో సిద్ధపడింది. ఇందుకోసం చోటా రాజన్ ముఠాకు చెందిన కొంత మందిని ఎంపిక చేసి మహారాష్ట్రకు ఆవల గుర్తుతెలియని చోట అవసరమైన శిక్షణ కూడా ఇచ్చింది.
అటల్ బిహారి వాజపేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ప్రధాన మంత్రి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్న అజిత్ డోవెల్ భారత ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డెరైక్టర్‌గా పనిచేసినప్పుడు ఈ కోవర్ట్ ఆపరేషన్‌కు రంగం సిద్ధం చేశారు. అయితే దావూద్ ఇబ్రహీం డీ-కంపెనీతో సంబంధాలున్న ముంబై పోలీసు ఉన్నతాధికారులు డబ్బుకు అమ్ముడుబోయి ఈ వ్యూహాన్ని వమ్ము చేశారు. కోవర్ట్ ఆపరేషన్ కోసం శిక్షణ పొందుతున్న చోటా రాజన్ ముఠా సభ్యులపై అరెస్టు వారెంట్లు తీసుకొచ్చి వారిని అరెస్టు చేశారు.
మాజీ హోం శాఖ కార్యదర్శి, ప్రస్తుత బీజీపీ నాయకుడు ఆర్కే సింగ్, సీదీ బాత్ కార్యక్రమం కింద ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. దావూద్ ఇబ్రహీంను హతమార్చేందుకు కోవర్ట్ ఆపరేషన్‌కు ప్రయత్నాలు జరిగినట్టు గతంలో పలుసార్లు పత్రికల్లో వార్తలొచ్చాయి. అయితే అధికారికంగా వెల్లడవడం మాత్రం ఇదే మొదటిసారి. ఇప్పటికీ దావూద్ ఇబ్రహీం పాక్ రక్షణలో ఉన్న విషయం తెల్సిందే. అందుకు సంబంధించి భారత ప్రభుత్వం తాజా సాక్ష్యాధారాలను కూడా సేకరించింది.
ఇప్పటికైనా దావూద్‌పై చర్య తీసుకునేందుకు భారత్ చొరవ తీసుకోవాలని, అందుకు ప్రపంచ టైస్ట్ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు అమెరికా నిర్వహించిన తరహాలో ఆపరేషన్ నిర్వహించాలని ఆర్కే సింగ్ సూచించారు. దావూద్‌తోపాటు లష్కరే తోయిబా చీఫ్ హఫీద్ సయాద్‌కు పాక్ రక్షణ కల్పిస్తున్న విషయం మనకే కాదని, మొత్తం ప్రపంచానికి తెలుసునని ఆయన అన్నారు. పాక్‌లో ఎవరి నుంచి తమకు ముప్పు ఏర్పడుతుందని తెలిసినా అమెరికా చర్యలు తీసుకుంటోందని, అలాగే మనం తీసుకోవాలని ఆయన వాదించారు.
దావూద్‌పై కమాండో ఆపరేషన్‌కు మనం సిద్ధపడితే పాకిస్తాన్ యుద్ధానికి వస్తుందనే భయం కొందరిలో ఉందని, మనతో యుద్ధంచేసే మూర్ఖత్వం పాకిస్తాన్‌కు ఉందని తాను భావించడం లేదని ఆర్కే సింగ్ అన్నారు. ఒకవేళ నిజంగా యుద్ధానికి వచ్చినా దాన్ని పటిష్టంగా ఎదుర్కొనే సామర్థ్యం మనకుందని ఆయన చెప్పారు. చర్చల పట్ల ఎప్పుడూ చిత్తశుద్ధి కనబర్చని పాకిస్తాన్‌తో చర్చల ప్రక్రియకు స్వస్తి చెప్పాలని, చర్యల ప్రక్రియ మొదలు పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సలహాదారులు సరైన సలహాలను ఇవ్వడం లేదని ఆయన అన్నారు.