ఆ విషయంలో భారత్ నెంబర్ 1
ప్రపంచంలో అత్యధిక వలసదారుల సంతతి కలిగిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇతర దేశాలకు వలస వెళ్లిన వారిలో భారతీయులే అత‍్యధికమంది ఉన్నారు. ఇతర దేశాల్లో కోటి 56 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నట్టు ప్యూ రీసెర్చ్ కేంద్రం వెల్లడించింది. అన్ని దేశాలకు చెందిన వలసదారుల సంఖ్య ప్రపంచ జనాభాలో 3.3 శాతం మంది ఉన్నట్టు అంచనా వేసింది.
ప్యూ రీసెర్చ్ ప్రకారం గతేడాది యూఏఈలో 35 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు కూడా భారతీయులు భారీ సంఖ్యలో వలస వెళ్లారు. గల్ఫ్ దేశాల్లో 1990 నాటికి 20 లక్షల మంది ఉండగా, 2015 నాటికి 80 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నట్టు అంచనా. గల్ఫ్ దేశాలకు చాలా వరకు ఉపాధి కోసం వలస వెళ్లారు.
అత్యధిక వలసదారుల సంతతి కలిగిన దేశాల్లో భారత్ తర్వాతి స్థానాల్లో వరుసగా మెక్సికో (కోటి 23 లక్షల మంది), రష్యా (కోటి 6 లక్షల మంది), చైనా (95 లక్షల మంది), బంగ్లాదేశ్ (72 లక్షల మంది) ఉన్నాయి. ఇక అత్యధికమంది వలసదారులకు ఆశ్రయం ఇచ్చిన దేశాల్లో అమెరికాది మొదటి స్థానం. అమెరికాలో మొత్తం 4 కోట్లా 66 లక్షల మంది వలసదారులు ఉన్నారు. ఆ తర్వాత జర్మనీ (కోటి 20 లక్షల మంది), రష్యా (కోటి 16 లక్షల మంది), సౌదీ అరేబియా (కోటి 2 లక్షల మంది), బ్రిటన్ (85 లక్షల మంది) దేశాలు ఎక్కువ మంది వలసదారులకు ఆశ్రయం ఇచ్చాయి.