
‘మెసేజ్‌ల స్టోరేజ్’పై వెనకడుగు
పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఎన్‌క్రిప్షన్ పాలసీ ఉపసంహరణ
* పొరపాట్లు సవరించి సరికొత్త విధానం రూపొందిస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: ప్రజలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో వివాదాస్పద ఎన్‌క్రిప్షన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్ల నుంచి ఈమెయిల్, వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట ర్ తదితర మాధ్యమాల ద్వారా వెళ్లే అన్ని సందేశాలను సులభంగా అర్థమయ్యే వాక్య రూపంలో సాధారణ వినియోగదారులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, టెలికం కంపెనీలు, ఇంటర్‌నెట్ ప్రొవైడర్లు 90 రోజుల పాటు కచ్చితంగా భద్రపరచాలంటూ ఒక ముసాయిదా ఎన్‌క్రిప్షన్ విధానాన్ని కేంద్రం సోమవారం ఐటీ శాఖ వెబ్‌సైట్లో పెట్టిన విషయం తెలిసిందే.
ఆ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు కోరినప్పుడు అందించాల్సి ఉంటుందని ఆ పాలసీలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధనలను పాటించని వారిపై చట్టపరంగా చర్యలుంటాయన్న హెచ్చరికను కూడా అందులో పొందుపర్చారు. దాంతో ప్రతిపక్షాలు, నెటిజన్లు, సామాజిక ఉద్యమకారుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. ఈ విధానం తమ సమాచార గోప్యతకు, తమ భద్రతకు భంగకరమని తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. దాంతో మర్నాడే ఆ ముసాయిదా విధానాన్ని వెనక్కు తీసుకుంటున్నామని, సందేశ నిక్షిప్త విధానానికి సంబంధించి త్వరలో స్పష్టమైన పాలసీని తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ విషయంలో కేంద్రం వెనకడుగు వేయడం ప్రభుత్వ తుగ్లక్ తరహా విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుత వ్యతిరేకత సాధించిన విజయమని కాంగ్రెస్ అభివర్ణించింది. అంతకుముందు, వాట్సప్, ఫేస్‌బుక్, ట్విటర్, తదితర సోషల్ మీడియా సైట్లు, పేమెంట్ గేట్‌వేలు, ఈ కామర్స్, పాస్‌వర్డ్ ఆధారిత లావాదేవీలను ఈ విధానం నుంచి మినహాయింపునిచ్చామని మంగళవారం ఉదయం ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత, కొన్ని గంటలకే .. మొత్తం ముసాయిదానే వెనక్కు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం టెలికం, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనిపై వివరణ ఇచ్చారు. ఆ వివరాలు..
* నిజానికి అది ప్రజల సూచనలను కోరుతూ వెల్లడించిన ఎన్‌క్రిప్షన్ విధాన ముసాయిదా మాత్రమే. అదే ప్రభుత్వ తుది విధానం కాదు.
* ముసాయిదాలోని కొన్ని నిబంధనలు అనవసర అపార్థాలకు, గందరగోళానికి తెరతీసేలా ఉన్న విషయాన్ని నేను కూడా గుర్తించాను. వెంటనే ఆ ముసాయిదాను వెనక్కు తీసుకుని, తప్పులను తొలగించి, నూతన ముసాయిదాను రూపొందించాలని ఐటీ శాఖను ఆదేశించాను.
* కొత్తగా రూపొందించే విధానంలో సాధారణ వినియోగదారులకు మినహాయింపు ఉంటుంది. సమాచారాన్ని సంకేత రూపంలో నిక్షిప్తం చేసే(ఎన్‌క్రిప్ట్)వారికే ఈ ఎన్‌క్రిప్షన్ పాలసీ వర్తిస్తుంది. ‘ఎవరికి మినహాయింపు ఉంటుంది.. ఎవరికి వర్తిస్తుంది’ అనే విషయంలో నూతన విధానంలో స్పష్టత ఉంటుంది.
* ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును మా ప్రభుత్వం గౌరవిస్తుంది. సోషల్ మీడియా క్రియాశీలతను మోదీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
* సైబర్‌క్రైమ్, ఇంటర్‌నెట్ ఆధారిత నేరాల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌క్రిప్షన్ పాలసీని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది.