'పాక్ కవ్వింపు చర్యలకు సమాధానమిచ్చే సత్తా ఉంది'
శ్రీనగర్: నియంత్రరణ రేఖ వద్ద తరచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టే సత్తా భారత సైనిక దళాలకు ఉందని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రక్షణ మంత్రిగా తొలిసారి అయన శనివారం జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాక్ కాల్పుల ఉల్లంఘన చర్యలను తిప్పికొట్టే సత్తా భారత్ కు ఉందని తెలిపారు. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం అంశానికి సంబంధించి పరిపాలన, పోలీస్, ఆర్మీ, పారా మిలటరీలకు చెందిన అధికారులతో జైట్లీ సమావేశం కానున్నారు. ఈ రోజు జైట్లీ పర్యటనలో సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ బిక్రమ్ సింగ్ కూడా పాల్గొన్నారు.
ఎల్‌ఓసీపై రక్షణ చర్యలు, రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితికి సంబంధించి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీనియర్ సైన్యాధికారులతో జైట్లీ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఎల్‌ఓసీపై ఇటీవల పాకిస్తాన్ జరిపిన కాల్పుల వివరాల్ని ఈ సందర్భంగా రక్షణ మంత్రికి ఆర్మీ అధికారులు వివరించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ శుక్రవారం భారత సైనిక కేంద్రాలపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.