మూత్రపిండ కేన్సర్‌కు ‘వేప’ మందు!
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండ సంబంధిత (రెనల్) కేన్సర్‌కు మన వేపతో చికిత్స చేయవచ్చని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తలు చెప్పారు. వేప చెట్టు నుంచి తీసిన రసాయనాల్లో నాలుగు రసాయనాలు కేన్సర్ కణాలను చంపగలుగుతున్నాయని తమ పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు. ‘రసాయన పరిశోధనల్లో ప్రకృతి స్ఫూర్తి’ అన్న అంశంపై సోమవారం ఐఐసీటీలో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది.
ఐఐసీటీ 70వ వార్షికోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సు మూడు రోజులపాటు జరగనుంది. ఈ సందర్భంగా ఐఐసీటీ శాస్త్రవేత్త ఎస్.చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడారు. అద్భుతమైన ఔషధంగా వేప గొప్పతనం కొత్త కానప్పటికీ.. రెనల్ కేన్సర్‌ను నియంత్రించేందుకూ వేప ఉపయోగపడుతుందని తాము గుర్తించామని ఆయన చెప్పారు. ప్రకృతి సిద్ధమైన అనేక రసాయనాలను, వాటి తయారీ ప్రక్రియలను అనుకరించేందుకు ఐఐసీటీలో విసృ్తత ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. రెనల్ కేన్సర్‌కు చికిత్సతోపాటు, వయసుతో వచ్చే మతిమరపు (అల్జీమర్స్) నివారణకు ‘గాలంథమైడ్’ అనే సహజ రసాయనం ఉపయోగపడుతుందని గుర్తించామన్నారు.
ఈ అంశాలపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు అంతర్జాతీయ స్థాయి సంస్థలైన మ్యాక్స్‌ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్, డార్ట్‌మండ్ యూనివర్సిటీ, మేయో క్లినిక్‌లతో కలసి పనిచేస్తున్నామని చంద్రశేఖర్ వివరించారు. కాగా.. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ గోవర్ధన్ మెహతా స్వాగతోపన్యాసం చేశారు. రానున్న కాలంలో సుస్థిర అభివృద్ధికి తోడ్పడే పరిశోధనలకు ఐఐసీటీ కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం, మాజీ డెరైక్టర్లు ఎ.వి.రామారావు, జె.ఎస్.యాదవ్, ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు.