జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని స్కూళ్లలో ఇకపై తెలుగు నేర్చుకోవచ్చు. ఒక సబ్జెక్ట్‌గా ఇకపై తెలుగు వర్ధిల్లనుంది. తెలుగు, హిందీ, తమిళం, గుజరాతీ, ఉర్దూ భాషలను తిరిగి పాఠశాలల్లో ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. రెండు దశాబ్దాల క్రితం భారతీయ భాషలను బోధనా ప్రణాళిక నుంచి తొలగించగా... తమ మాత భాషలను తిరిగి ప్రవేశపెట్టాలంటూ స్థానికంగా నివసించే 14లక్షల మంది భారతీయులు కోరుతూ వస్తున్నారు. ఎట్టకేలకు వారి విజ్ఞప్తులు ఫలించాయి. ముందుగా ఖ్వాజు నాటల్ ప్రావిన్స్ పరిధిలో దీన్ని అమలు చేయనున్నారు. 70 శాతం మంది భారత సంతతి ప్రజలు ఇక్కడే నివసిస్తున్నారు.
ఈ భాషల్లో ఏదేనీ ఒకదాన్ని తృతీయ భాషగా విద్యార్థులకు అందించవచ్చంటూ ప్రావిన్స్ విద్యాశాఖ అధిపతి కోసినాతి శిషి స్కూళ్లకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం కొన్ని స్కూళ్లు భారతీయ భాషలను ఒక సబ్జెక్టుగా బోధిస్తూనే ఉన్నాయి. అయితే, అవి ప్రభుత్వ ఆమోదిత పాఠ్యప్రణాళికలో భాగంగా లేవు. ఇకపై 10వ తరగతి ఇవి అధికారిక భాషలుగా గుర్తింపు పొందనున్నాయి.