
ప్రాణం మీదకు తెచ్చిన 'మురికి బూట్లు'
మిలాన్: 'మురికి బూట్లు' వివాదంలో ఫిలిప్పీన్స్ లో భారతీయుడొకరు కత్తిపోట్లకు గురైయ్యాడు. బాధితుడు 47 ఏళ్ల 'ఏఎస్'గా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన బాధితుడు మిలాన్ లోని నిగార్డా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు రెన్ జొ మికాలట్(19)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒకే ఫ్లాట్ లో ఉంటున్న మికాలట్, ఏఎస్ మధ్య 'మురికి బూట్లు' కారణంగా ఘర్షణ తలెత్తింది. ఏఎస్ కు చెందిన బూట్లును బయట పడేసేందుకు మికాలట్ ప్రయత్నించాడు. అతన్ని అడ్డుకునేందుకు ఏఎస్ ప్రయత్నించగా కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. పోలీసులు వచ్చే సరికి ఏఎస్ రక్తపు మడుగులో పడివున్నాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
దాడికి ఉపయోగించిన కత్తిని కడుగుతుండగా నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఇటలీకి చెందిన వాడని, అతడికి ఉద్యోగం లేదని పోలీసులు తెలిపారు. బాధితుడు, నిందితుడికి ఎటువంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు.