indian man
-
ఒళ్లు గగుర్పొడిచే తెలుగోడి విన్యాసం : శిక్షణ లేకుండా, ఎవరూ ట్రై చేయొద్దు!
సామాన్య వ్యక్తినుంచి అసామాన్య వ్యక్తిగా ఎదిగిన 'డ్రిల్ మ్యాన్' గుర్తు ఉన్నాడా? అబ్బరపరిచే సాహస విన్యాసాలకు మారుపేరు ఈ డ్రిల్ మ్యాన్. తాజాగా మరో ఒళ్లు గుగుర్పొడిచే సాహసంతో గిన్నిస్‌బుక్ రికార్డు సాధించాడు. ఆ సాహసం పేరే తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన క్రాంతి కుమార్ పనికెర అలియాస్ డ్రిల్‌మ్యాన్.57 విద్యుత్ ఫ్యాన్ బ్లేడ్ల నాలుకతో ఆపి, ఇన్క్రెడిబుల్ వరల్డ్ రికార్డ్ సాధించాడు. కేవలం ఒకే ఒక్క నిమిషాంలో ఈ ఫీట్ సాధించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అసాధారణమైన టైటిల్ కోసం అద్భుతమైన ప్రయత్నం డ్రిల్‌మ్యాన్ సాహసం ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. హైస్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపివేసి దృశ్యం ప్రేక్షకులను అబ్బురపర్చింది. ఆశ్చర్యంతో కళ్లప్పగించి చూడటం అక్కడున్న ప్రేక్షకులు, న్యాయనిర్ణేతల వంతైంది. 60 సెకన్లు గడిచిన తర్వాత, లో షో డీ రికార్డ్ అనౌన్సర్ "ఆపు" అనేంత వరకు ఆయన ప్రయత్నం కొనసాగింది. ఈ విషయంలో గతంలో తాను సృష్టించిన రికార్డును తానే అధిగమించాడు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ ఫీట్‌ను మరోసారి నిర్ధారించుకున్న న్యాయనిర్ణేతలు డ్రిల్మాన్కు సర్టిఫికేట్ అందించారు. ఈ టైటిల్‌ను సాధించిన తర్వాత డ్రిల్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు.2024లో అరవై సెకన్లలో ఎన్ని ఫ్యాన్లు నాలుకతో ఆపగలరు అన్న టాస్క్‌లో నాలుకతో ఏకంగా 52 ఫ్యాన్లను ఆపి రికార్డు సాధించాడు. అంతేనా రెండడుగుల కత్తిని గొంతు లోకి దింపాడు. ఇదే కత్తికి కట్టిన తాడు సాయంతో 1944 కిలోలుండే వోక్స్ వ్యాగన్ వాహనాన్ని ఐదు మీటర్లు లాగాడు. ఇందులో ఎనిమిది మంది ఉండటం విశేషం. ఆ తర్వాత అరవై సెకన్లలో నాలుగు అంగుళాల 22 మేకులను ముక్కులోకి సుత్తితో కొట్టి మళ్లీ బయటకు తీశాడు. ఇతగాడి జైత్రయాత్ర ఇంకా ఉంది. సలసల కాగే వేడి నూనెలో చికెన్ ముక్కలను చేతితో బయటకు తీయడం అనేఫీట్లో. కేవలం 60 సెకన్లలో 17 చికెన్ ముక్కలను తీసి గిన్నిస్ రికార్డులను సృష్టించాడు . ఇలా గతంలోనే నాలుగు రికార్డులు సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే ఇలాంటి రికార్డులు నెలకొల్పిన వ్యక్తిగా నిలిచాడు క్రాంతి కుమార్. తాజా ఫీట్‌తో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.Most electric fan blades stopped using the tongue in one minute 👅 57 by Kranthi Drillman 🇮🇳 pic.twitter.com/dsH8FULHxW— Guinness World Records (@GWR) January 2, 2025 -
కజకిస్థాన్ వధువు– తమిళ వరుడు
అన్నానగర్: అరియలూరు జిల్లా ముల్లుకురిచ్చి గ్రామానికి చెందిన రామచంద్రన్ కుమారుడు ప్రభాకరన్ (33). ఇతను మార్కిస్టు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు. గత 2 సంవత్సరాలుగా కజకిస్థాన్‌లోని విమానాశ్రయంలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడితో పాటు పనిచేసే కజకస్తాన్కు చెందిన షేక్మెదోవ్ కుమార్తె ఐ దానా(29)కు మధ్య పరిచయం ఏర్పడింది. చివరికి ఈ అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు చెప్పారు. వివాహానికి ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపారు. తమిళ సంస్కృతి ప్రకారం ప్రభాకరన్ తమిళనాడులో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దాని ప్రకారం ఐ దానా కుటుంబం అరియలూరుకు వచ్చింది. కాగా, మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ 24వ జిల్లా సదస్సు ఆదివారం కడలూరు జిల్లా పన్నాడంలోని ఓ ప్రైవేట్ హాలులో జరిగింది. ఈ సమావేశ వేదికపై పెళ్లికి ఏర్పాట్లు కూడా జరిగాయి. తమిళ సంçస్కృతి ప్రకారం వరుడు పట్టు పంచె, వధువు పట్టుచీరలో సమావేశ వేదికపైకి వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వాసుకి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభాకరన్, ఐ దానా కి తాళి కట్టారు. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు, పార్టీ సభ్యులు అందరూ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
అమెరికాలో బాపట్ల యువకుడి హత్య : హంతకుడు అరెస్ట్
అమెరికాలోని డల్లాస్‌లో భారతీయ యువకుడిని కాల్చి చంపిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక దుకాంలో చోరీకి పాల్పడి, దాసరి గోపీకృష్ణను కాల్చి చంపిన కేసులో మాథిస్‌పై అభియోగాలు నమోదు చేశారు. ఇతనిపై ఇంతకుముందు కూడా హత్యా నేరం అభియోగాలున్నాయని పోలీసులు వెల్లడించారు.జూన్ 21న, గోపీకృష్ణ పనిచేస్తున్న స్థానిక కన్వీనియన్స్ స్టోర్‌లో దుకాణంలో చోరీకి తెగబడిన మాథిస్ కౌంటర్ వద్ద ఉన్న గోపీకృష్ణపై పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు గోపీకృష్ణ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు, స్నేహితులు కాన్సులేట్ సహకారంతో గోపీకృష్ణ మృతదేహాన్ని బాపట్లలోని అతని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ ఎనిమిది నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు. గోపీకృష్ణకు రెండున్నరేళ్ల క్రితం ప్రవల్లికతో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. -
పొలంలో తెగిపడిన చేయి, ఇటలీలో భారతీయ కార్మికుడి దుర్మరణం
ఇటలీలో భారతీయ వ్యవసాయ కార్మికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ఒకటి కలకలం రేపింది. లాటినా ప్రాంతంలోని ఓ పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ సత్నామ్ సింగ్ చేయి తెగిపోయింది. అయితే తీవ్ర రక్తస్రావంతో ప్రమాదకర స్థితిలో ఉన్న అతడిని ఆసపత్రికి తరలించాల్సిన యాజమానులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. అతడిని రోడ్డుపై అలానే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసుపత్రికి తరలించడం ఆలస్యం కావడంతో సత్నామ్ సింగ్ కన్నుమూశాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.ఇటలీ కార్మికశాఖ మంత్రి మెరీనా కాల్డెరోన్ పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. "ఇది నిజంగా అనాగరిక చర్య," అని పేర్కొన్న ఆమె, అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, బాధ్యులను శిక్షిస్తామని ప్రకటించారు. అటు ఈ ఘటనను అక్కడి సెంటర్ లెఫ్ట్ డెమోక్రెటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గ్యాంగ్మాస్టర్లకు వ్యతిరేకంగా, గౌరవప్రదమైన పని, జీవన పరిస్థితుల కోసం పోరాటం కొనసాగుతుందని ఎక్స్ ద్వారా ప్రకటించింది.పదివేల మంది భారతీయ వలస కార్మికులు నివసించే రోమ్కు దక్షిణంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలోని లాటినాలోని పొలంలో సత్నామ్ సింగ్ పనిచేస్తున్నాడు. సోమవారం ప్రమాద వశాత్తూ ఓ యంత్రంలో పడి అతడి చేయి తెగిపోయింది. అయితే రక్తమోడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్నామ్ సింగ్‌ను పట్టించుకోలేదు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితుడి భార్య, స్నేహితులు అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బాధితుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు బుధవారం కన్నుమూశాడు. Flai CGIL ట్రేడ్ యూనియన్ ప్రకారం, సుమారు 31 ఏళ్ల వయస్సున్న సింగ్, చట్టపరమైన పత్రాలేవీ లేకుండా పని చేస్తున్నాడు. బాధితుడినిఆసుపత్రికి తరలించాల్సిన యజమానులు, చెత్త మూటలా వదిలేసి వెళ్లిపోయారని, ఇది హారర్ చిత్రాన్ని తలపిస్తోందని ట్రేడ్ యూనియన్ మండిపడింది. -
న్యూజెర్సీలో ఎన్నారై మహిళ దారుణ హత్య, నిందితుడు భారతీయుడే
అమెరికాలోని న్యూజెర్సీలో పంజాబ్‌కు చెందిన ఇద్దరు మహిళలపై భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. న్యూజెర్సీలోని కార్టెరెట్‌లోని నివాస భవనం వెలుపల 19 ఏళ్ల గౌరవ్ గిల్ జరిపిన కాల్పుల్లో జస్వీర్ కౌర్ (29) మరణించారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ కాల్పుల్లో మరో మహిళ,జస్వీర్ బంధువు గగన్‌దీప్ కౌర్ (20) తీవ్రగాయాలతో చికిత్స పొందుతోంది. నిందితుడు గిల్ నాకోదర్లోని హుస్సేనివాలా గ్రామానికి చెందినవాడని, బాధితులు జలంధర్‌లోని నూర్‌మహల్‌కు చెందినవారని తెలుస్తోంది. నిందితుడు గౌరవ్ గిల్‌ను హత్య కేసులో అరెస్టు చేశారు. అతనిపై హత్య, చట్టవిరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలపై కేసులు నమోదు చేశారు.హత్యకు గురైన జస్బీర్ కౌర్ తన బంధువు గగన్‌దీప్‌ను తన ఇంటికి ఆహ్వానించింది. ఈ సమయంలో అతడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ కాల్పుల వెనుక కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. పంజాబ్‌లోని నకోదర్ పట్టణంలోని IELTS కోచింగ్ సెంటర్లో గగన్‌దీప్‌తో గిల్‌కు పరిచయమున్నట్టు తెలుస్తోంది. కాగా జస్వీర్ కౌర్ న్యూజెర్సీలోని అమెజాన్‌లో పనిస్తుండగా, ఆమె భర్త, ట్రక్ డ్రైవర్‌గా ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. -
మనోళ్లు ముక్కుతో కూడా రికార్డులు కొట్టేస్తారు; వరుసగా మూడోసారి
ముక్కుతో టైప్ చేయడమే విశేషం. అందులో కూడా రికార్డ్. మళ్లీ తన రికార్డును తానే అధిగమించాడో వ్యక్తి. ఆయన పేరే ‘టైపింగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ వినోద్ కుమార్ చౌదరి. స్పెషల్ కీబోర్డుపైన ముక్కుతో వర్ణమాలను అత్యంత వేగంగా టైప్ చేసి ఈ ఫీట్‌ని మరోసారి రికార్డు స్థాయిలో సాధించాడు. వినోద్ కుమార్ చౌదరి ముక్కుతో కీబోర్డు ఆపరేట్ చేస్తున్న వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డు సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది. వరుసగా మూడోసారి కీబోర్డుపై అతి తక్కువ టైంలో ముక్కుతో ఆల్పాబెట్ టైప్ చేసి రికార్డులకెక్కారు వినోద్. 2023లో తొలిసారిగా 27.80 సెకన్లతో రికార్డు క్రియేట్ చేశారు. అదే ఏడాది రెండో ప్రయత్నంలో 26.73 సెకన్లతో తన రికార్డుని తానే అధిగమించారు. ఇపుడుముచ్చటగా మూడోసారి కూడా కేవలం 25.66 సెకన్లలో ఆల్ఫాబెట్ ని టైప్ చేసి రికార్డు బ్రేక్ చేశారు.How quickly could you type the alphabet with your nose (with spaces)? India's Vinod Kumar Chaudhary did it in 26.73 seconds ⌨️👃 pic.twitter.com/IBt7vghVai— Guinness World Records (@GWR) May 30, 2024ఈ విజయం పై వినోద్ సంతోషం ప్రకటించారు. ముక్కుతో టైపింగ్ చేయడంతో పాటు టైపింగ్‌లో పలు రికార్డులు తన పేరిట ఉన్నాయన్నారు. తన వృత్తి టైపింగ్ అని.. అందులో రికార్డు సృష్టించాలని కోరుకున్నానని అన్నారు. గంటలతరబడి సాధన చేసి ఈ రికార్డు బ్రేక్ చేశానని పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ లా తన పేరుతోనూ చాలా రికార్డులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు సచిన్ లా రికార్డుల రారాజు అనిపించుకోవడమే తన జీవిత లక్ష్యమని చెప్పడం విశేషం. -
ఉక్రెయిన్–రష్యా యుద్ధం: హైదరాబాద్ యువకుడు మృతి
సాక్షి, సిటీబ్యూరో/ నాంపల్లి: ఉపాధి, అధిక వేతనం ఆశ.. ఏజెంట్ల మోసం కారణంగా పాతబస్తీకి చెందిన ఓ యువకుడు రష్యాలో మృత్యువాతపడ్డాడు. బజార్‌ఘాట్‌కు చెందిన మహ్మద్ అఫ్సాన్ ఉద్యోగం కోసం రష్యాకు వెళ్లగా.. ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యాలోని పుతిన్ ప్రైవేట్ సైన్యంలో చేరాల్సి వచ్చింది. ఇతను ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొని అక్కడే అసువులు బాశాడు. ఈమేరకు రష్యాలోని భారతీయ రాయబారి కార్యాలయానికి సమాచారం అందింది. వారు బుధవారం అఫ్సాన్ సోదరుడు ఇమ్రాన్‌కు ఫోన్ చేసి ఈ విషయం తెలిపారు. దీంతో బజార్‌ఘాట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా అఫ్సాన్ దీన స్థితిని వివరించి కాపాడాలని ఇక్కడి ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే తన సోదరుడు చనిపోయాడని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. నారాయణ్‌పేట్‌కు చెందిన మహ్మద్ సుఫియాన్ అనే మరో యువకుడు ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయాడని, కనీసం అతడినైనా కాపాడాలని ఇమ్రాన్ విజ్ఞప్తి చేశాడు. ఆయన ఇక్కడ సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ తన సోదరుడిని బాబా బ్లాక్స్ కంపెనీ ఉద్యోగంలోకి తీసుకుందని, ఆ సంస్థ దుబాయ్, ఢిల్లీ, ముంబైలో కార్యాలయాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత్ నుంచి వెళ్లిన వారికి ఆర్మీ హెల్పర్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పారని, చివరికి వారిని సైన్యంలోకి చేర్చి ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించినట్లు వివరించారు. కాగా అఫ్సాన్‌కు భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. విషయం తెలిసి వీరు కన్నీరుమున్నీరయ్యారు. -
మోదీజీ.. ! ‘నా భార్యా, పిల్లల్ని వెనక్కి పంపించండి’
గ్రేటర్ నోయిడా: పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారత యువకుడిని కలిసేందుకు ఓ పాకిస్తాన్ మహిళ నలుగురు పిల్లలతో సహా భారత్‌లో చొరబడిన సంఘటన ఇటీవల గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. అక్రమంగా భారత్‌లో చొరబడినందుకు ఆ మహిళ పైనా, ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు ఆ యువకుడి పైనా కేసు నమోదు చేసి పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా విచారణ నడుస్తోంది. మీడియాలో ఈ సంఘటన బాగా వైరల్ కావడంతో సౌదీలో ఉంటున్న ఆ పాకిస్తాన్ మహిళ భర్తకు విషయం చేరింది. దీంతో తన భార్యను పిల్లలను తిరిగి పాకిస్తాన్ పంపించాల్సిందిగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఓ సందేశాన్ని పంపించాడు. పబ్జీ గేమ్ చాలామందికి ఒక వ్యసనం. అందులో పడ్డారంటే చాలు గంటలపాటు పరిసరాలను మరచి పరధ్యానంగా గడుపుతుంటారు. తాజాగా ఈ పబ్జీ గేమ్ ఓ కొంపను కొల్లేరు చేసింది. యూపీలోని నొయిడాకు చెందిన 25 ఏళ్ల సచిన్ మీనాకు పాకిస్తాన్ కు చెందిన 30 ఏళ్ల సీమా హైదర్ పబ్జీ ద్వారా పరిచయమైంది. నాలుగేళ్ల ప్రయాణంలో ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు. అప్పటికే సీమాకు పెళ్ళై నలుగురు పిల్లలున్నారు. అయినా కూడా ప్రేమ గుడ్డితనాన్ని ప్రపంచానికి చాటుతూ సీమా హైదర్ నలుగురి పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్ చేరుకొని పబ్జీ ప్రియుడిని కలుసుకుంది. ఆమె రాకను గుర్తించిన స్థానిక పోలీసులు, అక్రమంగా భారత్ లో చొరబడినందుకు ఆమె పైన కేసు నమోదు చేశారు. ఆశ్రయమిచ్చినందుకు సచిన్ పైన కూడా కేసు నమోదు చేసి ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. జెవార్ సివిల్ కోర్టు వారికి బెయిల్ కూడా మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పక రావాల్సిందిగా కోరింది. ఇదిలా ఉండగా ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో సౌదీ అరేబియాలో ఉన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ కు ఈ విషయం చేరింది. దీంతో వెంటనే స్పందిస్తూ.. మొదటగా ఈ వార్త నాకు తెలిసేలా చేసిన భారత మీడియాకు కృతఙ్ఞతలు.. నా భార్యకు కల్లబొల్లి మాటలు చెప్పి, మభ్యపెట్టి భారత్ రప్పించారు. దయచేసి నా భార్యను, పిల్లలను తిరిగి పాకిస్తాన్ పంపించండి.. అంటూ భారత ప్రభుత్వానికి ఒక సందేశాన్ని పంపించాడు. ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీలోకి చొరబడ్డ ఆగంతకుడు.. ఎందుకొచ్చాడంటే.. -
వైరల్: హాయ్ ఫ్రెండ్స్.. మా అమ్మ ఊరు దాటిందోచ్
వైరల్: మనిషి జీవితంలో ప్రత్యేక క్షణాలు కొన్ని ఉంటాయి. మనకు అవి సాధారణమే అనిపించొచ్చు. కానీ, అవతలి వాళ్లకు మాత్రం అవి ఎంతో మధురం.. ప్రత్యేకం. అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ యువకుడి సందేశం ఇప్పుడు నెటిజన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారత్‌కు చెందిన దత్తాత్రేయ జే.. సింగపూర్‌లో బ్లాక్‌చెయిన్ డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అతను లింకెడిన్లో రెండు ఫొటోలను పోస్ట్ చేశాడు. అవి అతను తన తల్లితో ఉన్నవి. పరాయి గడ్డపై తన ప్రపంచం ఎలా ఉందో చూపించేందుకు తల్లిని ఆహ్వానించినట్లు.. ఏనాడూ ఊరిని దాటని ఆమె ఎట్టకేలకు దేశం దాటిందని సంతోషం వ్యక్తం చేశాడతను. ఎట్టకేలకు మా అమ్మ నా దగ్గరికి.. సింగపూర్‌కి వచ్చింది. ఆమెకు నా ఆఫీస్‌ను, అందమైన ఈ నగరాన్ని చూపించాలనుకుంటున్నా(ఆల్రెడీ అంతా తిప్పి చూపించాడట). ఆమె భావోద్వేగాలను, భావాలను వర్ణించడం కష్టమే. ఎందుకంటే.. తన జీవితంలో ఆమె ఊరు దాటింది లేదు. విమానాన్ని ఏ రకంగానూ ఆమె చూసి ఎరగదు. నా తండ్రి ఇక్కడ లేకపోవడం.. నన్నెంతో బాధించింది. మా కుటుంబంలో వేరే దేశానికి వెళ్లిన మొదటి మహిళ.. మా అమ్మే. మా ఊరి నుంచి రెండో ఘనత సాధించారామె(మొదటి వ్యక్తి దత్తాత్రేయ భార్య). అందుకే నాకిది ప్రత్యేకమైన సందర్భం అంటూ పోస్ట్ చేశాడతను. ఇలా విదేశాల్లో ఉన్న పిల్లలు.. తమ తల్లిదండ్రులను తమ చెంతకు రప్పించుకుని.. దగ్గరుండి వాళ్లకు సంతోషాన్ని పంచాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎందుకంటే తనలా తల్లిదండ్రులు దేశవిదేశాలు తిప్పాలని కలలు గనే పిల్లలు ఎంతో మంది ఉంటారనేది అతని ఉద్దేశమంట. ప్రస్తుతం అతని పోస్ట్‌కు లైకులు, షేర్లు దక్కుతున్నాయి. -
మూడు దేశాల ముచ్చటైన కళ్యాణం
-
మూడు దేశాల ముచ్చటైన కళ్యాణం
డెన్వర్: జర్మనీ అమ్మాయి, విశాఖ అబ్బాయి ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో అమెరికాలో వైభవంగా జరిగింది. లిండా ముల్లర్, దైవిక్ శశాంక్ స్నేహ బంధం ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఎస్బీఐ విశ్రాంత అధికారి, ప్రసిద్ధ గాయకులు, విశాఖ కళాసాగర్ వ్యవస్దాపక అధ్యక్షులు వానపల్లి శ్రీమన్నారాయణ ఏకైక కుమారుడు శశాంక్‌తో లిండా ముల్లర్ వివాహం ముచ్చటగా జరిగింది. ప్రకృతి సోయగాల అందాల నడుమ సాంప్రదాయ పద్ధతిలో అమెరికాలో హిందూ బంధుమిత్రుల నడుమ వేద మంత్రాలతో వైభవంగా ఈ వివాహ వేడుక జరగడం విశేషం. -
లక్కీ డ్రా.. రాత్రికి రాత్రే రూ.7.45 కోట్లు జాక్‌పాట్
దుబాయ్: లక్కీడ్రాలు కొంతమందికి కలిసివస్తాయి. ఒక లాటరీ టికెట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరులనైన వార్తలను మనం ఇప్పటికే చాలా చూసి ఉంటాం. తాజాగా భారత్‌కు చెందిన ప్రైవేట్ నౌకలో ఉద్యోగిగా పనిచేస్తున్న గణేష్ షిండేకు కూడా ఇలాంటి అదృష్టమే వరిచింది. వివరాలు.. మహారాష్ట్రలోని థానేకు చెందిన 36 ఏళ్ల గణేశ్ బ్రెజిల్‌కు చెందిన ఒక ప్రైవేటు నౌకసంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో భాగంగా అతడు దుబాయ్, రియో డీ జనెయిరోల మధ్య రాకపోకలు సాగించేవాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా గణేష్ దుబాయ్ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. కాగా గత జూన్ 16న దుబాయ్‌లో మిలీనియం మిలియనీర్ అండ్ ఫైనస్ట్ సర్ప్రైజ్ నుంచి ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. తాజాగా గురువారం లాటరీ టికెట్లను విడుదల చేయగా గణేష్‌కు జాక్‌పాట్ తగిలింది. 1 మిలియన్ యునైటెడ్ స్టేట్స డాలర్స్( ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.7.45 కోట్లు) దక్కించుకున్నాడు. ఇదే విషయమై గణేష్ స్పందించాడు.'' నాకు లాటరీ తగలిందనే విషయాన్ని ఇప్పటికి నమ్మలేకపోతున్నా. లాటరీలో వచ్చిన డబ్బుతో కొత్త కారు, కొత్త ప్లాటు కొంటాను. పిల్లల చదువు కోసం కొంత డబ్బులు దాచుకుంటాను.ఇది చాలా గొప్ప అవకాశం. దుబాయ్ డ్యూటీ ఫ్రీకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను దుబాయ్ నగరాన్ని ప్రేమిస్తున్నాను. త్వరలోనే దుబాయ్‌ను సందర్శించాలని అనుకుంటున్నాను. ఇంకా చాలా కోరికలున్నాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. -
కారు డ్రైవర్‌కు రూ.40 కోట్ల జాక్‌పాట్; కానీ ట్విస్ట్ ఏంటంటే
అబుదాబి: 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్ 2008లో కేరళ నుంచి అబుదాబికి వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 12 ఏళ్లలో ఎప్పుడు కలిసిరాని అదృష్టం ఒక్కరాత్రిలోనే వరించింది. లక్కీడ్రాలో ఏకంగా 20 మిలియన్ దిర్హామ్( భారత కరెన్సీలో దాదాపు రూ. 40 కోట్లు) దక్కించుకున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ 40 కోట్ల రూపాయలను రెంజిత్‌తో పాటు మరో తొమ్మిదిమంది పంచుకోవాల్సి ఉంది. ఎందుకంటే రెంజిత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన మరో తొమ్మిది మంది కూడా లక్కీడ్రాలో డబ్బును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని ఖలీజ్‌టైమ్స్ పత్రిక శనివారం వెల్లడించింది.ఇక తన వాటా కింద సోమరాజన్‌కు ఎంతలేదన్న దాదాపు 4 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్న సోమరాజన్‌కు పంట పండినట్లే. ఇదే విషయమై రెంజిత్ సోమరాజన్ స్పందిస్తూ.. '' నాకు ఇంత జాక్‌పాట్ తగులుతుందని ఊహించలేదు. 2008లో ఇండియా నుంచి దుబాయ్‌కు వచ్చాను. అప్పటినుంచి బతుకుదెరువు కోసం డ్రైవర్‌గా మారాను. గతేడాది ఒక కంపెనీ డ్రైవర్ కమ్ సేల్స్‌మన్‌గా పనిచేశాను. ఆ సమయంలో నేను సరైన సేల్స్ చేయని కారణంగా నా జీతంలో కోత విధించేవారు. అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పటినుంచి లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించాను. అలా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందని మిగతా వ్యక్తులతో కలిసి ''రెండు కొంటే ఒక లాటరీ టికెట్ ఉచితం'' ఆఫర్‌ను కనుక్కున్నా. ఆ తొమ్మిది మంది నుంచి 100 దిర్హామ్‌లు వసూలు చేసి జూన్ 29న టికెట్‌ను కొనుగోలు చేశాను. నా ఒక్కడి పేరుతో తీస్తే అదృష్టం లేదని.. అందుకే మరో తొమ్మిది మందిని జత చేశాను. ఇవాళ నా పంట పండింది. నా వాటా తీసుకొని మిగతాది మావాళ్లకు ఇచ్చేస్తాను. ఎందుకంటే వారు నాపై నమ్మకం ఉంచి లాటరీ టికెట్‌కు డబ్బులు అందించారు''. అని చెప్పుకొచ్చాడు. -
సిడ్నీ నగరంలో... సిగ్గే పడుతూ...
సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య సుదీర్ఘ కాలంగా మైదానంలో ఉన్న వైరంపై సాగిన చర్చలోనే వారిద్దరి మధ్య పరిచయం, ఆపై స్నేహం మొదలైంది. అది అలా పెరిగి ప్రేమగా మారింది. అయితే తర్వాతి అడుగు వేసేందుకు ఇద్దరూ వెనుకాడుతున్న వేళ... అబ్బాయే కాస్త చొరవ చూపించాడు. పెళ్లి ప్రతిపాదన చేసేందుకు తాము ఇష్టపడే క్రికెట్ స్టేడియంకంటే సరైన వేదిక... అందులోనూ భారత్–ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌కు మించిన సందర్భం ఏదీ లేదని భావించాడు. అందుకే వేల మంది ప్రేక్షకుల సమక్షంలో మోకాలిపై కూర్చొని తన మనసులో భావాన్ని వెల్లడించాడు. అటు గ్యాలరీల్లో ప్రేక్షకులు, ఇటు టీవీల్లో లక్షల మంది చూస్తుండగా అమ్మాయీ ‘ఎస్’ అనేసింది. క్రికెటర్లు మొదలు కామెంటేటర్ల వరకు అందరూ ఆ జోడీని అభినందిస్తూ ఆశీర్వదించారు! బెంగళూరుకు చెందిన దీపేన్ మాండలియా ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే జెట్‌స్టార్ సంస్థలో ప్రాజెక్ట్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్‌గా పని చేస్తున్నాడు. మెల్‌బోర్న్‌కే చెందిన రోజ్ వింబుష్‌ని అతను ఏడాదిన్నర కాలంగా ప్రేమిస్తున్నాడు. ‘ఆమె కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించింది కానీ నాకు అంతకంటే సరైన సమయం లేదనిపించింది’ అని దీపేన్ చెప్పగా... ‘నిజంగా ఏం జరుగుతోందో అర్థం కాలేదు. చాలా ఆశ్చర్యపోయా. కానీ ఇది నన్ను చాలా ఆనందంలో ముంచెత్తింది’ అని రోజ్ స్పందించింది. ఈ ఘటన తర్వాత ఇద్దరి ఫోన్లు ‘కంగ్రాట్స్’ మెసేజ్‌లతో హోరెత్తిపోయాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
అమెరికాలో భారత వ్యక్తి దారుణ హత్య
వాషింగ్టన్ : అమెరికాలోభారత సంతతి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. దొంగతనానికి వచ్చిన గుర్తితెలియన దుండగులు అతనిపై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో చోటు చేసుకుంది. మృతుడు హరియాణా రాష్ట్రానికి చెందిన మనీందర్ సింగ్ సాహిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరియాణాలోని కర్నాల్ నగరానికి చెందిన మనీందర్ సింగ్ సాహి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో గల ఓ స్టోర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కాగా, గత శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో మనీందర్ సింగ్ స్టోర్‌లో ఉండగా గుర్తుతెలియని దుండగుడు మాస్క్ ధరించి స్టోర్‌లోకి వచ్చాడు. ఆ సమయంలో స్టోర్‌లో ఇద్దరు కస్టమర్లు మాత్రమే ఉన్నారు. అయితే వారిపై ఎలాంటి దాడి చేయని దుండగుడు స్టోర్ ఉద్యోగి మనీందర్ సింగ్‌పై కాల్పులు జరిపి హత్య చేశాడు. అనంతరం కౌంటర్లో ఉన్న డబ్బులు తీసుకొని పారిపోయాడు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని అమెరికా పోలీసులు పేర్కొన్నారు. కాగా, మనీందర్ సింగ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత నెల 31న మనీందర్ సింగ్ తిరిగి అమెరికాకు వచ్చారు. మృత దేహాన్ని ఇండియాకు తరలించేందుకు డబ్బులు లేవని, భారత ప్రభుత్వం సహాయం చేయాలని మృతుడి సోదరుడు విజ్ఞప్తి చేశాడు. ***HOMICIDE UPDATE*** Homicide occurred at the 7-11 store 8438 Santa Fe Springs Road. Suspect entered the store with a semi-automatic handgun killing the clerk. Suspect is described as a male black adult, 5-06/5-07. Anyone with information contact Whittier PD 562-567-9281. pic.twitter.com/MSNhvcHrJB — Whittier Police Dept (@whittierpd) February 23, 2020 -
వెంబడిస్తూ వేధింపులు.. భారత యువకుడికి జైలు
లండన్ : లండన్‌లో ఓ యువతిని నిత్యం వెంబడిస్తూ వేధింపులకు గురిచేస్తున్న భారత యువకుడికి 29 నెలల జైలు శిక్షతోపాటూ, భారత్‌కు పంపించాలని కోర్టు తీర్పునిచ్చింది. లండన్‌లోని వెంబ్లీలోని ఓ షాప్‌లో పని చేస్తున్న యువతి(20)ని 2017లో భారత్‌కు చెందిన రోహిత్ శర్మ(28) మొదటి సారి చూశాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో అమె నిరాకరించింది. ఇక అప్పటి నుంచి ఆమెను వెంబడించడంతో బాధితురాలు ఏకంగా ఉద్యోగం మానేసి మరో చోట పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత కూడా ఆమె పని చేసే చోటును కనిపెట్టి మరీ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలికి రోజుకు 40కిపైగా వివిధ ఫోన్ల నుండి కాల్స్ చేసి వేధించేవాడు. బాధితురాలు ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసిన ప్రతిసారి కొత్త ఫోన్ నెంబర్ నుంచి కాల్స్ చేసి వేధించేవాడు. వేధింపులు ఎక్కువ కావడంతో 2018ఫిబ్రవరిలో పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో రోహిత్‌కు హారాస్మెంట్ వార్నింగ్ ఇచ్చారు. అప్పటికీ మారకుండా తరచూ యువతిని వెంబడిస్తూ పని చేసే చోటుకు వెళ్లి గంటల తరబడి చూస్తూ వేధించేవాడు. దీంతో 2018 జూలైలో పోలీసులు కేసు నమోదు చేసి రోహిత్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలై తిరిగి వేధింపులు ప్రారంభించాడు. 2018 నవంబర్‌లో కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అతడికోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటెలీజెన్స్ పోలీసుల సమాచారంతో 2019 ఏప్రిల్‌లో రోహిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో రోహిత్ దోషిగా తేలడంతో యువతిని వెంబడించినందుకు 22 నెలలు, వేధింపులకు పాల్పడినందుకు 6 నెలలు, కోర్టు విచారణకు హాజరు కానందుకు ఒక నెల కలిపి మొత్తం 29 నెలల జైలు శిక్షతోపాటూ, శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతడిని భారత్‌కు పంపించాలని లండన్‌లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టు తీర్పు వెలువరించింది. -
విమానంలో లైంగిక దాడి : భారతీయుడికి జైలు శిక్ష
న్యూయార్క్ : విమానంలో నిద్రిస్తున్న మహిళను లైంగికంగా వేధించిన భారతీయుడికి గురువారం తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది జనవరిలో స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో లాస్‌వెగాస్ నుంచి డెట్రాయిట్ వెళుతున్న ప్రభు రామమూర్తి తన పక్కనున్న 23 ఏళ్ల యువతి నిద్రిస్తుండగా అసభ్యకరంగా వ్యవహరించాడు. తాను మెలుకవ వచ్చి చూడగా నిందితుడు తన దుస్తులు తొలగించి తనను తాకరాని చోట తాకుతూ అమర్యాదకరంగా ప్రవర్తించాడని బాధితురాలు వెల్లడించారు. నిందితుడు తీవ్ర తప్పిదానికి పాల్పడినందున 11 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరగా, అమెరికా జిల్లా జడ్జి టెరెన్స్ బెర్గ్ 9 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతరులు ఈ తరహా నేరాలకు పాల్పడకుండా ఇలాంటి శిక్షలు ఉపకరిస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఆగస్టులో న్యాయస్ధానం రామమూర్తిని దోషిగా తేల్చింది. జైలు శిక్ష పూర్తయిన అనంతరం రామమూర్తిని అమెరికా అధికారులు భారత్‌కు తరలిస్తారు. కాగా శిక్ష ఖరారు చేసే సమయంలో వృత్తిరీత్యా మోడల్ అయిన బాధితురాలు న్యాయస్ధానంలో మాట్లాడేందుకు నిరాకరించారు. ముందువరుసలో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కూర్చుని తీర్పును వీక్షించారు. విచారణ సందర్భంగా ధైర్యంగా తనకు ఎదురైన లైంగిక వేధింపులను వివరించిన బాధితురాలిని అమెరికన్ అటార్నీ మ్యాథ్యూ స్కెండిర్ ప్రశంసించారు. విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సురక్షితంగా ఉండే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. 2015లో వర్క్ వీసాపై అమెరికా వచ్చిన రామమూర్తి తన భార్యతో కలిసి లాస్‌వెగాస్ విమానంలో డెట్రాయిట్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
భారత సంతతి యువకుడిపై కాల్పులు.. కలకలం
టొరంటో : భారత సంతతికి చెందిన 27 ఏళ్ల యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో స్వగృహంలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది బ్రాంప్టన్‌లో చోటుచేసుకున్న 11వ హత్య అని.. ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందంటూ వలసదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవల తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శరత్ కొప్పు(25) హత్యకు గరైన విషయం తెలిసిందే. ఆపై పరారీలో ఉన్న నిందితుడ్ని అమెరికా పోలీసులు కాల్చిచంపారు. పోలీసుల కథనం ప్రకారం.. భారత్‌కు చెందిన పల్విందర్ సింగ్ 2009లో ఉపాధి నిమిత్తం కెనడాకు వెళ్లాడు. బ్రాంప్టన్ నగరంలో నివాసం ఉంటున్న పల్విందర్ ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం నలుగురు గుర్తుతెలియని దుండగులు పల్విందర్ ఇంట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయి అతడు మృతిచెందాడు. ఈ హత్యకేసులో నిందితులైన మిస్సిస్సౌగాకు చెందిన 18, 19 ఏళ్ల యువకులిద్దరూ లొంగిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ‘మరో రెండు రోజుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సిన నా మిత్రుడు ఇకలేడు. ఇక బర్త్‌డే పార్టీ ఎవరు చేసుకుంటారు మిత్రమా. నువ్వు బతికుండాల్సిన వాడివి’ అంటూ పల్విందర్ స్నేహితుడొకరు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. గన్ కల్చర్ కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు మేయర్ లిండా జెఫ్రీకి ఫిర్యాదు చేశారు. -
దుబాయ్‌లో భారతీయుడికి రూ.21కోట్ల లాటరీ
దుబాయ్: భారత్‌కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్‌లో జాక్ పాట్ కొట్టాడు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో మంగళ వారం జరిగిన బిగ్ టికెట్ లాటరీలో ఏకంగా రూ.21.2 కోట్లు(12 మిలియన్ల దిర్హామ్‌లు) గెలుచుకున్నాడు. కేర ళకు చెందిన జాన్ వర్గీస్ ఇక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లాటరీ గెలిచినట్లు ఫోన్ కాల్ వచ్చిందని, ఎవరైనా తనని ఏప్రిల్ ఫూల్ చేయడానికి కాల్చేసి ఉంటారని భావించా నని జాన్ చెప్పారు. డబ్బుతో తొలుత స్మార్ట్‌ఫోన్ కొనుక్కుంటానని తెలిపాడు. తర్వాత కొంత భాగాన్ని తన ఇద్దరు పిల్లల చదువుకు, మిగతా మొత్తాన్ని పేదవారికి కేటాయిస్తానని చెప్పాడు. -
గల్ఫ్ వెల్తున్నారా.. ఎవరైనా పార్సిల్స్ ఇస్తున్నారా?
-
విమానంలో చేయకూడని పని చేశాను.. సారీ!
న్యూయార్క్: అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయుడు విమానంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముంబై నుంచి న్యూజెర్సీలోని నెవార్క్ వెళుతున్న ఎయిరిండియా విమానంలో అతను ఈ విధంగా దుశ్ప్రవర్తనకు పాల్పడ్డాడు. మహిళను అసభ్యంగా తాకాడు. ఇందుకుగాను క్షమాపణ కోరుతూ అతను లేఖలు రాశాడని అధికారులు తెలిపారు. తనను లైంగికంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఎయిర్‌పోర్టు అధికారులు 40 ఏళ్ల గణేష్ పార్కర్‌ను అరెస్టు చేశారు. అతను నెవార్క్ ఫెడరల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. ‘ఎయిరిండియా విమానంలో తనది బిజినెస్ క్లాస్ సీటు అయినప్పటికీ పార్కర్ ఎకానమీ క్లాస్‌లో ఓ మహిళ పక్కన ఖాళీగా ఉన్న సీటులో కూర్చున్నాడు. నిద్రపోతున్న మహిళ తన బ్లాంకెట్‌ను ఎవరో తొలగించినట్టు అనిపిస్తే లేచి చూసింది. మళ్లీ నిద్రలోకి జారుకోగా.. పార్కర్ ఆమె చొక్కాలోకి చెయ్యిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో షాక్ తిన్న మీరు ఏం చెస్తున్నారని కేకలు వేసింది’ అని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. దీంతో పార్కర్‌ను తనకు కేటాయించిన సీటు వద్దకు విమాన సిబ్బంది పంపించేశారని, అయితే, తాను మూర్ఖమైన చర్యకు పాల్పడ్డానని పార్కర్ అంగీకరిస్తూ.. క్షమాపణ నోటు రాసి పెట్టారని వారు వివరించారు. 50వేల డాలర్ల పూచీకత్తుమీద పార్కర్ జైలు నుంచి విడుదలైనా.. కొంతకాలంపాటు హౌస్ అరెస్టులో ఉండాలని కోర్టు ఆదేశించింది. -
62 అడుగుల జుట్టుతో అదరహో..
న్యూఢిల్లీ: ఓ రెండు వారాల్లో జుట్టు కత్తిరించుకోకుంటేనే ఏదో పిచ్చి లేచినట్లుగా చిరాకుచిరాకుగా అనిపిస్తుంది. కనీసం చెవులుదాటి జుట్టుపెరిగినా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏవైన దేవుడి మొక్కులు ఉంటే తప్ప ఓ మోస్తరుగా జుట్టుపెంచం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 62 అడుగులు పొడవునా జుట్టు పెంచుకుంటే పరిస్థితి ఏమిటి. సావిభాయి రత్వా అనే 60 ఏళ్ల వ్యక్తి ఇలాగే చేశాడు. అతడు జుట్టు పెంచుకున్న విధం చూస్తే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బహుశా.. జుట్టుపై కత్తెర కనీసం ఒకసారి కూడా పెట్టనిచ్చాడో లేదో అనే అనుమానం వస్తుంది. అంత పొడవువగా జుట్టుపెంచుకున్నాడు. ఈ జుట్టు పెరుగుదల కొనసాగించడం కోసం అతడు తీసుకునే జాగ్రత్తలు కూడా అంతా ఇంతా కాదు. ఇష్టమొచ్చినట్లుగా ఆహార పానీయాలు కూడా అతడు తీసుకోడు. ప్రత్యేక ఆహారపు అలవాట్లు పాటిస్తాడు. రోజుకు మూడు గంటలు తన కేశాలను శుభ్రం చేసుకునేందుకు కేటాయిస్తాడు. అంతేకాదు.. అతడు బయటకు వెళ్లే సమయంలో తన జుట్టును తాడును మడతపెట్టి చేతికి చుట్టుకొని వెళ్లినట్లుగా వెళుతుంటాడు. అప్పుడప్పుడు తన తలపాగా మాదిరిగా కూడా చుట్టుకొని తిరుగుతుంటాడు. ఇక ఇంటిముందు వేలాడదీశాడంటే దుస్తులు ఆరేసుకునే పెద్ద తాడులా అది దర్శనం ఇస్తుంది. మరోఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతడు మాంసాహారాన్ని తినడంట. పైగా స్పైసీ ఫుడ్‌కు కూడా చాలా దూరంగా ఉండి కేవలం ఇంటి భోజనం మాత్రమే చేస్తాడని చెప్పుకొచ్చాడు. -
ప్రాణం మీదకు తెచ్చిన 'మురికి బూట్లు'
మిలాన్: 'మురికి బూట్లు' వివాదంలో ఫిలిప్పీన్స్ లో భారతీయుడొకరు కత్తిపోట్లకు గురైయ్యాడు. బాధితుడు 47 ఏళ్ల 'ఏఎస్'గా గుర్తించారు. తీవ్రగాయాలపాలైన బాధితుడు మిలాన్ లోని నిగార్డా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు రెన్ జొ మికాలట్(19)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే ఫ్లాట్ లో ఉంటున్న మికాలట్, ఏఎస్ మధ్య 'మురికి బూట్లు' కారణంగా ఘర్షణ తలెత్తింది. ఏఎస్ కు చెందిన బూట్లును బయట పడేసేందుకు మికాలట్ ప్రయత్నించాడు. అతన్ని అడ్డుకునేందుకు ఏఎస్ ప్రయత్నించగా కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. పోలీసులు వచ్చే సరికి ఏఎస్ రక్తపు మడుగులో పడివున్నాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాడికి ఉపయోగించిన కత్తిని కడుగుతుండగా నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఇటలీకి చెందిన వాడని, అతడికి ఉద్యోగం లేదని పోలీసులు తెలిపారు. బాధితుడు, నిందితుడికి ఎటువంటి నేర చరిత్ర లేదని వెల్లడించారు. -
వాష్ రూములోకి తొంగిచూసినందుకు...
దుబాయ్: మహిళల వాష్ రూములోకి తొంగిచూసిన నేరంలో దుబాయ్ లో 26 ఏళ్ల భారతీయ కార్మికుడొకరు జైలు పాలయ్యాడు. నేరం రుజువు కావడవంతో నిందితుడికి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష పూర్తైన తర్వాత తమ దేశం విడిచి వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించింది. ఓ మసీదులోని మహిళల వాష్ రూములోకి తొంగిచూస్తూ పట్టుబడడంతో అతడపై కేసు నమోదైంది. గోడ వెనుకవైపున ఉన్న చిన్న గదిలో నుంచి వాష్ రూములోని తమను గమనిస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిందని 'ఖలీల్ టైమ్స్' తెలిపింది. మొదటి తప్పుగా పరిగణించి మూడు నెలల జైలు శిక్ష విధించినట్టు కోర్టు పేర్కొంది. -
ముద్దు పెట్టిన కేసులో ఎన్నారైకి జైలు శిక్ష
నెవార్క్: విమానంలో తనతోపాటు ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎన్నారై దేవేందర్ సింగ్ (62)కి యూఎస్ కోర్టు ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు నెవార్క్‌లోని జడ్జి స్టాన్లీ చెస్లర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేవేందర్ సింగ్ హ్యూస్టన్ నుంచి నెవార్క్‌కు యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే కూర్చున్న మహిళకు ముద్దు పెట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దాంతో వెంటే నిద్ర నుంచి మొల్కొన్న సదరు మహిళ భయపడిపోయింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బంది వద్దకు వెళ్లి దేవేందర్‌పై ఫిర్యాదు చేసింది. దాంతో విమానం ఎయిర్పోర్ట్ చేరగానే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో దేవేందర్ సింగ్‌కు ఎనిమిది నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఎన్నారై దేవేందర్ సింగ్ ల్యూసియానాలో నివసిస్తున్నాడు.