వెంబడిస్తూ వేధింపులు.. భారత యువకుడికి జైలు | Indian Man Jailed For 29 Months For Stalking Girl In UK | Sakshi
Sakshi News home page

వెంబడిస్తూ వేధింపులు.. భారత యువకుడికి జైలు

Published Fri, May 17 2019 10:56 AM | Last Updated on Fri, May 17 2019 11:02 AM

Indian Man Jailed For 29 Months For Stalking Girl In UK - Sakshi

లండన్‌ : లండన్‌లో ఓ యువతిని నిత్యం వెంబడిస్తూ వేధింపులకు గురిచేస్తున్న భారత యువకుడికి 29 నెలల జైలు శిక్షతోపాటూ, భారత్‌కు పంపించాలని కోర్టు తీర్పునిచ్చింది. లండన్‌లోని వెంబ్లీలోని ఓ షాప్‌లో పని చేస్తున్న యువతి(20)ని 2017లో భారత్‌కు చెందిన రోహిత్‌ శర్మ(28) మొదటి సారి చూశాడు. అనంతరం తనను పెళ్లి చేసుకోవాలని కోరడంతో అమె నిరాకరించింది. ఇక అప్పటి నుంచి ఆమెను వెంబడించడంతో బాధితురాలు ఏకంగా ఉద్యోగం మానేసి మరో చోట పనిచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత కూడా ఆమె పని చేసే చోటును కనిపెట్టి మరీ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలికి రోజుకు 40కిపైగా వివిధ ఫోన్ల నుండి కాల్స్‌ చేసి వేధించేవాడు. బాధితురాలు ఫోన్‌ నెంబర్లను బ్లాక్‌ చేసిన ప్రతిసారి కొత్త ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్స్‌ చేసి వేధించేవాడు. 

వేధింపులు ఎక్కువ కావడంతో 2018ఫిబ్రవరిలో పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడంతో రోహిత్‌కు హారాస్మెంట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అప్పటికీ మారకుండా తరచూ యువతిని వెంబడిస్తూ పని చేసే చోటుకు వెళ్లి గంటల తరబడి చూస్తూ వేధించేవాడు. దీంతో 2018 జూలైలో పోలీసులు కేసు నమోదు చేసి రోహిత్‌ను అరెస్ట్‌ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలై తిరిగి వేధింపులు ప్రారంభించాడు. 2018 నవంబర్‌లో కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అతడికోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటెలీజెన్స్‌ పోలీసుల సమాచారంతో 2019 ఏప్రిల్‌లో రోహిత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో రోహిత్‌ దోషిగా తేలడంతో యువతిని వెంబడించినందుకు 22 నెలలు, వేధింపులకు పాల్పడినందుకు 6 నెలలు, కోర్టు విచారణకు హాజరు కానందుకు ఒక నెల కలిపి మొత్తం 29 నెలల జైలు శిక్షతోపాటూ, శిక్షాకాలం పూర్తయిన తర్వాత అతడిని భారత్‌కు పంపించాలని లండన్‌లోని ఐల్వర్త్‌ క్రౌన్‌ కోర్టు తీర్పు వెలువరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement