న్యూయార్క్ : విమానంలో నిద్రిస్తున్న మహిళను లైంగికంగా వేధించిన భారతీయుడికి గురువారం తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది జనవరిలో స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో లాస్‌వెగాస్ నుంచి డెట్రాయిట్ వెళుతున్న ప్రభు రామమూర్తి తన పక్కనున్న 23 ఏళ్ల యువతి నిద్రిస్తుండగా అసభ్యకరంగా వ్యవహరించాడు. తాను మెలుకవ వచ్చి చూడగా నిందితుడు తన దుస్తులు తొలగించి తనను తాకరాని చోట తాకుతూ అమర్యాదకరంగా ప్రవర్తించాడని బాధితురాలు వెల్లడించారు.
నిందితుడు తీవ్ర తప్పిదానికి పాల్పడినందున 11 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరగా, అమెరికా జిల్లా జడ్జి టెరెన్స్ బెర్గ్ 9 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతరులు ఈ తరహా నేరాలకు పాల్పడకుండా ఇలాంటి శిక్షలు ఉపకరిస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఆగస్టులో న్యాయస్ధానం రామమూర్తిని దోషిగా తేల్చింది. జైలు శిక్ష పూర్తయిన అనంతరం రామమూర్తిని అమెరికా అధికారులు భారత్‌కు తరలిస్తారు.
కాగా శిక్ష ఖరారు చేసే సమయంలో వృత్తిరీత్యా మోడల్ అయిన బాధితురాలు న్యాయస్ధానంలో మాట్లాడేందుకు నిరాకరించారు. ముందువరుసలో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కూర్చుని తీర్పును వీక్షించారు. విచారణ సందర్భంగా ధైర్యంగా తనకు ఎదురైన లైంగిక వేధింపులను వివరించిన బాధితురాలిని అమెరికన్ అటార్నీ మ్యాథ్యూ స్కెండిర్ ప్రశంసించారు. విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సురక్షితంగా ఉండే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. 2015లో వర్క్ వీసాపై అమెరికా వచ్చిన రామమూర్తి తన భార్యతో కలిసి లాస్‌వెగాస్ విమానంలో డెట్రాయిట్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment