
62 అడుగుల జుట్టుతో అదరహో..
న్యూఢిల్లీ: ఓ రెండు వారాల్లో జుట్టు కత్తిరించుకోకుంటేనే ఏదో పిచ్చి లేచినట్లుగా చిరాకుచిరాకుగా అనిపిస్తుంది. కనీసం చెవులుదాటి జుట్టుపెరిగినా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏవైన దేవుడి మొక్కులు ఉంటే తప్ప ఓ మోస్తరుగా జుట్టుపెంచం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 62 అడుగులు పొడవునా జుట్టు పెంచుకుంటే పరిస్థితి ఏమిటి. సావిభాయి రత్వా అనే 60 ఏళ్ల వ్యక్తి ఇలాగే చేశాడు. అతడు జుట్టు పెంచుకున్న విధం చూస్తే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బహుశా.. జుట్టుపై కత్తెర కనీసం ఒకసారి కూడా పెట్టనిచ్చాడో లేదో అనే అనుమానం వస్తుంది. అంత పొడవువగా జుట్టుపెంచుకున్నాడు.
ఈ జుట్టు పెరుగుదల కొనసాగించడం కోసం అతడు తీసుకునే జాగ్రత్తలు కూడా అంతా ఇంతా కాదు. ఇష్టమొచ్చినట్లుగా ఆహార పానీయాలు కూడా అతడు తీసుకోడు. ప్రత్యేక ఆహారపు అలవాట్లు పాటిస్తాడు. రోజుకు మూడు గంటలు తన కేశాలను శుభ్రం చేసుకునేందుకు కేటాయిస్తాడు. అంతేకాదు.. అతడు బయటకు వెళ్లే సమయంలో తన జుట్టును తాడును మడతపెట్టి చేతికి చుట్టుకొని వెళ్లినట్లుగా వెళుతుంటాడు. అప్పుడప్పుడు తన తలపాగా మాదిరిగా కూడా చుట్టుకొని తిరుగుతుంటాడు.
ఇక ఇంటిముందు వేలాడదీశాడంటే దుస్తులు ఆరేసుకునే పెద్ద తాడులా అది దర్శనం ఇస్తుంది. మరోఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతడు మాంసాహారాన్ని తినడంట. పైగా స్పైసీ ఫుడ్కు కూడా చాలా దూరంగా ఉండి కేవలం ఇంటి భోజనం మాత్రమే చేస్తాడని చెప్పుకొచ్చాడు.