
హారర్ చిత్రాన్ని తలపించేలా..అమానవీయ ఘటన, కలకలం
ఇటలీలో భారతీయ వ్యవసాయ కార్మికుడికి తీవ్ర ప్రమాదం
పట్టించుకోని వైనం, ఆసుపత్రిలో కన్నుమూత
ఇటలీలో భారతీయ వ్యవసాయ కార్మికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ఒకటి కలకలం రేపింది. లాటినా ప్రాంతంలోని ఓ పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ సత్నామ్ సింగ్ చేయి తెగిపోయింది. అయితే తీవ్ర రక్తస్రావంతో ప్రమాదకర స్థితిలో ఉన్న అతడిని ఆసపత్రికి తరలించాల్సిన యాజమానులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. అతడిని రోడ్డుపై అలానే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసుపత్రికి తరలించడం ఆలస్యం కావడంతో సత్నామ్ సింగ్ కన్నుమూశాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటలీ కార్మికశాఖ మంత్రి మెరీనా కాల్డెరోన్ పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. "ఇది నిజంగా అనాగరిక చర్య," అని పేర్కొన్న ఆమె, అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, బాధ్యులను శిక్షిస్తామని ప్రకటించారు. అటు ఈ ఘటనను అక్కడి సెంటర్ లెఫ్ట్ డెమోక్రెటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గ్యాంగ్‌మాస్టర్‌లకు వ్యతిరేకంగా, గౌరవప్రదమైన పని, జీవన పరిస్థితుల కోసం పోరాటం కొనసాగుతుందని ఎక్స్ ద్వారా ప్రకటించింది.

పదివేల మంది భారతీయ వలస కార్మికులు నివసించే రోమ్‌కు దక్షిణంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలోని లాటినాలోని పొలంలో సత్నామ్ సింగ్ పనిచేస్తున్నాడు. సోమవారం ప్రమాద వశాత్తూ ఓ యంత్రంలో పడి అతడి చేయి తెగిపోయింది. అయితే రక్తమోడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్నామ్ సింగ్‌ను పట్టించుకోలేదు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితుడి భార్య, స్నేహితులు అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బాధితుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు బుధవారం కన్నుమూశాడు.
Flai CGIL ట్రేడ్ యూనియన్ ప్రకారం, సుమారు 31 ఏళ్ల వయస్సున్న సింగ్, చట్టపరమైన పత్రాలేవీ లేకుండా పని చేస్తున్నాడు. బాధితుడినిఆసుపత్రికి తరలించాల్సిన యజమానులు, చెత్త మూటలా వదిలేసి వెళ్లిపోయారని, ఇది హారర్ చిత్రాన్ని తలపిస్తోందని ట్రేడ్ యూనియన్ మండిపడింది.