
అరవై ఏళ్ల స్నానం!
టెహ్రాన్: ఆయన వయస్సు ఎనభై ఏళ్లు.. ఊరవతల ఒక సమాధి లాంటి గుంతలో ఉంటాడు.. అరవై ఏళ్లుగా స్నానం లేదు.. చేతులు, కాళ్లు కడుక్కోవడం వంటి శుభ్రతా లేదు.. జంతువుల మలాన్ని ఎండబెట్టుకుని పొగతాగుతాడు.. కుళ్లిపోయిన ముళ్లపంది మాంసం తింటాడు.. కానీ, ఇప్పటికీ తనకో తోడు కోసం ఎదురుచూస్తున్నాడు. దక్షిణ ఇరాన్‌లోని డెజ్గా గ్రామానికి చెందిన అమో హాజీ వ్యవహారమిది. నీళ్లతో శుభ్రం చేసుకుంటే రోగాల పాలవుతాననే అతని భయమే దీనికి కారణమట.
ఆయన ఇరవై ఏళ్ల వయస్సులో ఉండగా ఏవో సమస్యలతో మానసికంగా కుంగిపోయి ఇలా మారిపోయాడని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. అయితే, ఇవన్నీ చేస్తున్నాడని హాజీని పిచ్చివాడనీ అనలేం మరి! ఎందుకంటే.. అందరితో బాగానే మాట్లాడుతాడు. కార్ల అద్దాల ముందు తల దువ్వుకుంటాడు. వెంట్రుకలు పొడవు పెరిగితే మంటల్లో కాల్చి సరిచేసుకుంటాడు కూడా. ఇంతకు ముందు ఇలా ఎక్కువ కాలం స్నానం చేయని రికార్డు.. కైలాష్ సింగ్ అనే భారతీయుడిదే. కైలాష్ 38 ఏళ్లపాటు స్నానం చేయలేదు.