సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య సుదీర్ఘ కాలంగా మైదానంలో ఉన్న వైరంపై సాగిన చర్చలోనే వారిద్దరి మధ్య పరిచయం, ఆపై స్నేహం మొదలైంది. అది అలా పెరిగి ప్రేమగా మారింది. అయితే తర్వాతి అడుగు వేసేందుకు ఇద్దరూ వెనుకాడుతున్న వేళ... అబ్బాయే కాస్త చొరవ చూపించాడు. పెళ్లి ప్రతిపాదన చేసేందుకు తాము ఇష్టపడే క్రికెట్ స్టేడియంకంటే సరైన వేదిక... అందులోనూ భారత్–ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌కు మించిన సందర్భం ఏదీ లేదని భావించాడు. అందుకే వేల మంది ప్రేక్షకుల సమక్షంలో మోకాలిపై కూర్చొని తన మనసులో భావాన్ని వెల్లడించాడు. అటు గ్యాలరీల్లో ప్రేక్షకులు, ఇటు టీవీల్లో లక్షల మంది చూస్తుండగా అమ్మాయీ ‘ఎస్’ అనేసింది.
క్రికెటర్లు మొదలు కామెంటేటర్ల వరకు అందరూ ఆ జోడీని అభినందిస్తూ ఆశీర్వదించారు! బెంగళూరుకు చెందిన దీపేన్ మాండలియా ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ప్రస్తుతం మెల్‌బోర్న్‌లోనే జెట్‌స్టార్ సంస్థలో ప్రాజెక్ట్ అండ్ రిపోర్టింగ్ అనలిస్ట్‌గా పని చేస్తున్నాడు. మెల్‌బోర్న్‌కే చెందిన రోజ్ వింబుష్‌ని అతను ఏడాదిన్నర కాలంగా ప్రేమిస్తున్నాడు. ‘ఆమె కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించింది కానీ నాకు అంతకంటే సరైన సమయం లేదనిపించింది’ అని దీపేన్ చెప్పగా... ‘నిజంగా ఏం జరుగుతోందో అర్థం కాలేదు. చాలా ఆశ్చర్యపోయా. కానీ ఇది నన్ను చాలా ఆనందంలో ముంచెత్తింది’ అని రోజ్ స్పందించింది. ఈ ఘటన తర్వాత ఇద్దరి ఫోన్లు ‘కంగ్రాట్స్’ మెసేజ్‌లతో హోరెత్తిపోయాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment