గ్రేటర్ నోయిడా: పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారత యువకుడిని కలిసేందుకు ఓ పాకిస్తాన్ మహిళ నలుగురు పిల్లలతో సహా భారత్‌లో చొరబడిన సంఘటన ఇటీవల గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. అక్రమంగా భారత్లో చొరబడినందుకు ఆ మహిళ పైనా, ఆమెకు ఆశ్రయమిచ్చినందుకు ఆ యువకుడి పైనా కేసు నమోదు చేసి పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచగా విచారణ నడుస్తోంది. మీడియాలో ఈ సంఘటన బాగా వైరల్ కావడంతో సౌదీలో ఉంటున్న ఆ పాకిస్తాన్ మహిళ భర్తకు విషయం చేరింది. దీంతో తన భార్యను పిల్లలను తిరిగి పాకిస్తాన్ పంపించాల్సిందిగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఓ సందేశాన్ని పంపించాడు.
పబ్జీ గేమ్ చాలామందికి ఒక వ్యసనం. అందులో పడ్డారంటే చాలు గంటలపాటు పరిసరాలను మరచి పరధ్యానంగా గడుపుతుంటారు. తాజాగా ఈ పబ్జీ గేమ్ ఓ కొంపను కొల్లేరు చేసింది. యూపీలోని నొయిడాకు చెందిన 25 ఏళ్ల సచిన్ మీనాకు పాకిస్తాన్ కు చెందిన 30 ఏళ్ల సీమా హైదర్ పబ్జీ ద్వారా పరిచయమైంది. నాలుగేళ్ల ప్రయాణంలో ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు.
అప్పటికే సీమాకు పెళ్ళై నలుగురు పిల్లలున్నారు. అయినా కూడా ప్రేమ గుడ్డితనాన్ని ప్రపంచానికి చాటుతూ సీమా హైదర్ నలుగురి పిల్లలతో కలిసి నేపాల్ మీదుగా భారత్ చేరుకొని పబ్జీ ప్రియుడిని కలుసుకుంది. ఆమె రాకను గుర్తించిన స్థానిక పోలీసులు, అక్రమంగా భారత్ లో చొరబడినందుకు ఆమె పైన కేసు నమోదు చేశారు. ఆశ్రయమిచ్చినందుకు సచిన్ పైన కూడా కేసు నమోదు చేసి ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. జెవార్ సివిల్ కోర్టు వారికి బెయిల్ కూడా మంజూరు చేసి తదుపరి వాయిదాకు తప్పక రావాల్సిందిగా కోరింది.
ఇదిలా ఉండగా ఈ వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించడంతో సౌదీ అరేబియాలో ఉన్న సీమా హైదర్ భర్త గులామ్ హైదర్ కు ఈ విషయం చేరింది. దీంతో వెంటనే స్పందిస్తూ.. మొదటగా ఈ వార్త నాకు తెలిసేలా చేసిన భారత మీడియాకు కృతఙ్ఞతలు.. నా భార్యకు కల్లబొల్లి మాటలు చెప్పి, మభ్యపెట్టి భారత్ రప్పించారు. దయచేసి నా భార్యను, పిల్లలను తిరిగి పాకిస్తాన్ పంపించండి.. అంటూ భారత ప్రభుత్వానికి ఒక సందేశాన్ని పంపించాడు.
ఇది కూడా చదవండి: కర్ణాటక అసెంబ్లీలోకి చొరబడ్డ ఆగంతకుడు.. ఎందుకొచ్చాడంటే..
Comments
Please login to add a commentAdd a comment