సాక్సులు తెచ్చిన తంటా
సాక్షి, న్యూఢిల్లీ: సౌకర్యంకోసం, అందంకోసం వేసుకున్న సాక్స్‌లు ఓ వ్యక్తికి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టాయి. ఓ యువకుడు ధరించిన సాక్సులు కుళ్లు కంపు కొడుతున్నాయంటూ తోటి ప్రయాణీకులు గొడవ చేయడంతో వివాదం చెలరేగింది. చివరకు పరస్పరం కేసులు నమోదు చేసుకునే దాకా వెళ్లింది.
వివరాల్లోకి వెళితే.... ప్రవీణ్‌కుమార్ (27) హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీకి బస్సులో వెళుతున్నాడు. బూట్లు, సాక్స్‌లు తొలగించి కాస్త సేద తీరేలోపే బస్సులో కలకలం రేగింది. బాబోయ్.. ఈ కంపు మా వల్ల కాదంటూ తోటి ప్రయాణీకులు గగ్గోలు పెట్టారు. వాటిని బయటికి విసిరి పారేయమని ప్రాధేయపడ్డారు. దీనికి ప్రవీణ్ నో చెప్పడంతో వారు తీవ్ర నిరసనకు దిగారు. దీంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. చివరికి బస్సు ఆపివేయించి మరీ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. తమను బెదిరించడంతోపాటు..అతని సాక్సుల వల్ల బస్సును మధ్యలో అనేకసార్లు ఆపాల్సి వచ్చిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉనా పోలీసులు అతగాడిని అరెస్ట్‌చేసి తరువాత బెయిల్‌పై విడుదల చేశారు.
పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసు పెట్టామని పోలీసు అధికారి సంజీవ్ గాంధీ తెలిపారు. అయితే ప్రయాణీకులు అనవసరంగా తనతో గొడవకు దిగారని.. అసలు తన సాక్సులు చెడు వాసనే రాలేదని వాపోయాడు ప్రవీణ్. అంతేకాదు తోటి ప్రయాణీకులు,బస్సు సిబ్బందిపై కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేసి.. మరో బస్సులో ఊరికి చేరుకున్నాడు.