పుణే: భారత నావికా దళం ప్రాబల్యం సముద్ర జలాల్లో విస్తరిస్తోందని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా అన్నారు. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో ఓ నౌకను శాశ్వతంగా మోహరించామని, పశ్చిమ నేవీ కమాండ్‌కు చెందిన నౌక ఒకటి మధ్యదరా సముద్రం గుండా అంట్లాటిక్ చేరిందని తెలిపారు. పుణేలోని జాతీయ రక్షణ అకాడమీ(ఎన్‌డీఏ) గ్రాడ్యుయేట్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి లాంబా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
తూర్పు కమాండ్‌కు చెందిన నౌకలు సింగపూర్‌తో కలిసి దక్షిణ చైనా సముద్రంలో సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయని ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాతో కూడా విన్యాసాలు చేపట్టేందుకు అవి బయల్దేరాయని తెలిపారు. ముంబైలో జరిగిన 26–11 లాంటి మరో దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్ని అయినా అమలు చేస్తామని పేర్కొన్నారు.
నావికా దళం ఆధునీకరణ గురించి మాట్లాడుతూ... నేవీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటోందని అన్నారు. 1960 నుంచి 200కు పైగా నౌకలను దేశీయంగా తయారుచేశామని తెలిపారు. ప్రస్తుతం 41 నౌకలు, జలాంతర్గాములు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. విధుల నుంచి తప్పించిన ఐఎన్‌ఎస్ విరాట్‌ను మ్యూజియంగా మార్చడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్‌డీఏ నుంచి 312 మంది శిక్షణను పూర్తిచేసుకున్నారు. వీరిలో 211 మంది ఆర్మీ నుంచి, 34 మంది నేవీ నుంచి, 67 మంది వాయుసేన నుంచి ఉన్నారు.
‘ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం’
Published Wed, May 31 2017 12:31 PM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
Advertisement
Advertisement