sunil lanba
-
తదుపరి నేవీ చీఫ్‌గా కరమ్‌బీర్
న్యూఢిల్లీ: నావికాదళం తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్‌ను కేంద్రం నియమించింది. మే 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. విశాఖలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్(ఎఫ్‌వోసీ–ఇన్– సీ)గా ఉన్న కరమ్‌బీర్ మే 31వ తేదీన విధుల్లో చేరుతారని పేర్కొంది. హెలికాప్టర్ పైలెట్ ఒకరు నేవీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టనుండటం ఇదే ప్రథమం. అత్యంత సీనియర్ అధికారిని ఈ పదవికి నియమించాలన్న సంప్రదాయ విధానాన్ని పక్కనబెట్టి ప్రతిభే గీటురాయిగా కరమ్‌బీర్‌ను ఎంపిక చేసినట్లు రక్షణ శాఖ స్పష్టం చేసింది. కరమ్‌బీర్ గురించి ఇంకొంత స్వస్థలం: పంజాబ్‌లోని జలంధర్ ∙పుట్టిన తేదీ: నవంబర్ 3, 1959 నేవీలో చేరింది: జూలై 1, 1980 హెలికాప్టర్ పైలెట్‌గా ఎంపిక: 1982 శిక్షణ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (పూణె), డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్(వెల్లింగ్టన్), చేతక్, కమోవ్ హెలీకాప్టర్ల పైలెట్‌గా విశేష అనుభవం. అనుభవం: 37 ఏళ్ల సర్వీసులో కరమ్‌బీర్ సింగ్ ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్ చాంద్బీబీ, మిసైల్ కార్వెట్ ఐఎన్ఎస్ విజయ్‌దుర్గ్, గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ ఐఎన్ఎస్ రాణా నౌకలకు కమాండర్‌గా పనిచేశారు. -
‘ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం’
పుణే: భారత నావికా దళం ప్రాబల్యం సముద్ర జలాల్లో విస్తరిస్తోందని, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా అన్నారు. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో ఓ నౌకను శాశ్వతంగా మోహరించామని, పశ్చిమ నేవీ కమాండ్‌కు చెందిన నౌక ఒకటి మధ్యదరా సముద్రం గుండా అంట్లాటిక్ చేరిందని తెలిపారు. పుణేలోని జాతీయ రక్షణ అకాడమీ(ఎన్డీఏ) గ్రాడ్యుయేట్ల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి లాంబా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తూర్పు కమాండ్‌కు చెందిన నౌకలు సింగపూర్‌తో కలిసి దక్షిణ చైనా సముద్రంలో సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయని ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాతో కూడా విన్యాసాలు చేపట్టేందుకు అవి బయల్దేరాయని తెలిపారు. ముంబైలో జరిగిన 26–11 లాంటి మరో దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్ని అయినా అమలు చేస్తామని పేర్కొన్నారు. నావికా దళం ఆధునీకరణ గురించి మాట్లాడుతూ... నేవీ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటోందని అన్నారు. 1960 నుంచి 200కు పైగా నౌకలను దేశీయంగా తయారుచేశామని తెలిపారు. ప్రస్తుతం 41 నౌకలు, జలాంతర్గాములు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. విధుల నుంచి తప్పించిన ఐఎన్ఎస్ విరాట్‌ను మ్యూజియంగా మార్చడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్డీఏ నుంచి 312 మంది శిక్షణను పూర్తిచేసుకున్నారు. వీరిలో 211 మంది ఆర్మీ నుంచి, 34 మంది నేవీ నుంచి, 67 మంది వాయుసేన నుంచి ఉన్నారు. -
ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
తయారవుతున్న 41 నౌకలు నేవీ అవార్డుల ప్రదానంలో నావికాదళాధిపతి సునీల్ లంబ సాక్షి, విశాఖపట్నం: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత నావికాదళం సిద్ధంగా ఉందని భారత నావికాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లంబ స్పష్టం చేశారు. విశాఖలోని తూర్పు నావికాదళం కమాండ్ పెరేడ్ గ్రౌండ్లో గురువారం జరిగిన భారత నేవీ సిబ్బంది వార్షిక అవార్డుల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 33 మంది నేవీ అధికారులు, సైలర్లకు గాల్లంట్రీ, నాన్ గాల్లంట్రీ అవార్డులను ఆయన అందజేశారు. లెఫ్ట్‌నెంట్ కమాండర్లు వికాస్కుమార్ నర్వాల్, నీరజ్‌కుమార్, కమాండర్ వీర్సింగ్లకు నౌసేన మెడల్‌ను ప్రదానం చేశారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో హల్ అర్టిఫిసర్ రాకేష్‌కుమార్‌కు నౌసేన అవార్డు లభించగా ఆయన తరఫున అతని తల్లి అవార్డును అందుకున్నారు. నేవీ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినందుకు సర్వోత్తమ్ జీవన్ రక్ష పతక్‌ను కమాండర్ షిశిర్ కుమార్ యాదవన్నవార్కు ప్రకటించగా ఆయన తల్లి, భార్య కన్నీటి నడుమ అవార్డును స్వీకరించారు. ఎనిమిది నౌసేన మెడల్స్, పదహారు విశిష్ట్ సేవా మెడల్స్, సర్వోత్తమ్ జీవన్ రక్షక్ పతక్ అవార్డులు, జీవన్ రక్ష పతక్ అవార్డులు, కెప్టెన్ రవిధీర్ మెడల్ అవార్డు, లెఫ్టెనెంట్ వీకే జైన్ మెమోరియల్ గోల్డ్‌మెడల్‌ను, గడిచిన ఏడాదిలో ప్రతిభ కనబరిచిన ఆరు యూనిట్లకు అందించారు. వేడుకలో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం లంబ ప్రసంగిస్తూ.. సిబ్బంది త్యాగం, వారి కుటుంబం అందించే ప్రోత్సాహమే నావికాదళానికి బలమని చెప్పారు. ప్రపంచంలోనే భారత నావికాదళం బలంగా ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. అనంతరం విలేకరులతో లంబ మాట్లాడారు. నేవీ అభివృద్ధి కోసం 15 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళిక వేశామని వెల్లడించారు. వివిధ నౌకా నిర్మాణ కేంద్రాల్లో 41 నౌకలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. తూర్పు నావికాదళాధిపతి బిస్త్, నేవీ ఉన్నతాధికారులు, సిబ్బంది, నౌకలు, సబ్మెరైన్లు ఈ వేడకల్లో పాలుపంచుకున్నాయి. -
విరాట్‌కు గుడ్‌బై.. నాలుగునెలల్లో భవితవ్యం
న్యూఢిల్లీ: భారత నేవీ దళానికి అతి కీలకమైన సేవలు అందించిన భారీ యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ నేటితో బాధ్యతలకు గుడ్‌బై చెబుతుంది. దాదాపు 30 ఏళ్లపాటు గొప్ప సేవలు అందించిన విరాట్‌ను ఇక విధుల నుంచి విరమింపజేస్తున్నట్లు నేవీ చీఫ్ సునీల్ లంబా తెలిపారు. నాలుగు నెలల్లో దీనిని కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ కాకుంటే విడిభాగాలుగా చేసి స్క్రాప్‌కు పంపిస్తామని తెలిపారు. భారత ఆర్మీకి 30 ఏళ్లు, అంతకుముందు 27 ఏళ్లు రాయల్ నేవీకి సేవలు అందించిన విరాట్‌కు సోమవారం సాయంత్రం ముగింపు పలుకుతామని అన్నారు. అయితే, ఈ షిప్‌ను మ్యూజియంగా మారుస్తామని గతంలో ఆంధ్రప్రదేశ్ చెప్పింది. అయితే, ఇందుకోసం దాదాపు రూ.1000 కోట్లు అవసరం అవుతాయి. గుజరాత్‌లోని అలాంగ్ ప్రాంతంలో దీనిని ఈ రోజు సాయంత్రం నిలిపి అక్కడ నుంచే కొనేవాళ్లకు అప్పగించడమా లేకుంటే స్క్రాప్‌కు తరలించడమా అనే ప్రక్రియ జరుగనుంది. మొత్తం 11 లక్షల కిలోమీటర్ల దూరాన్ని విరాట్ పూర్తి చేసిందని, ఇది మొత్తం గ్లోబును 27సార్లు చుట్టొచ్చినట్లని అన్నారు. ఐఎన్ఎస్ విరాట్ ప్రత్యేకతలు.. ఇది ప్రపంచంలోనే అతి ప్రాచీన యుద్ధ వాహక నౌక భారతీయ నేవీలోకి 1987లో అడుగుపెట్టింది దేశంలో నిర్వహించిన అన్ని మేజర్ ఆపరేషన్లలో విరాట్ పాల్గొంది విరాట్‌ను 1959లో బ్రిటీష్ రాయల్ నేవీ కోసం తయారుచేశారు ఆ సమయంలో ఫాక్లాండ్ యుద్ధంలో విజయం సాధించడంతో విరాట్‌కు గొప్ప పేరు ప్రఖ్యాతలు ఆ తర్వాత భారత నేవీలోకి 1987లో అడుగు ఈ వాహక నౌకకు 14 సార్లు మరమ్మత్తులు చేశారు కీలక ఆపరేషన్లు ఆపరేషన్ జూపిటర్ (1988, శ్రీలంకతో శాంతికొనసాగింపు మిషన్) ఆపరేషన్ విజయ్ (1999, పోస్ట్-కార్గిల్) ఆపరేషన్ పరక్రామ్(2001, పార్లమెంటుపై దాడి జరిగిన సందర్భంలో) విరాట్ కీలక పాత్ర పోషించింది. ప్రత్యేకతలు విరాట్ 743 అడుగుల పొడవు, 160 అడుగుల వెడల్పు, 29 అడుగుల ఎత్తు ఉంటుంది 16 సీ హ్యారియర్ జెట్స్, 4 సీ కింగ్ కాప్టర్స్, 2 చేతక్ చాపర్స్, 4 ధ్రువ కాప్టర్స్ను నిలిపే సామర్థ్యం విరాట్ సొంతం ఇందులోని నేవీ ఆయుధ సామాగ్రిని, యుద్ధ సామాగ్రిని బయటకు తీయడానికి ఆరు నెలల సమయం పడుతుంది. -
నావీ చీఫ్‌గా సునీల్ లంబా బాధ్యతలు
న్యూఢిల్లీ: భారత నావికాదళ నూతన ప్రధానాధికారిగా అడ్మిరల్ సునీల్ లంబా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నౌకాదళ అధిపతిగా ఉన్న ఆర్కే ధోవన్ ఇవాళ పదవీ విరమణ చేశారు. దీంతో ధోవన్ నుంచి సునీల్ లంబా బాధ్యతలు స్వీకరించారు. 58 ఏళ్ల లంబా ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఇప్పటివరకూ సునీల్ లంబా పశ్చిమ నావికాదళ కమాండర్‌గా విధులు నిర్వహించారు. భారత నావికాదళానికి ఆయన 23వ అధిపతి. 30 ఏళ్ల పాటు నావికదళానికి సేవలందించినందుకుగానూ ఆయన ఇటీవలే పరమ విశిష్ట సేవా పతకంతో కేంద్ర ప్రభుత్వం నుంచి సత్కారం అందుకున్నారు. -
ఇండియన్ నేవీ కొత్త చీఫ్ సునిల్ లాంబా
న్యూఢిల్లీ: వైస్ అడ్మిరల్ సునిల్ లాంబా మే31న ఇండియన్ నేవీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన పశ్చిమ నావికాదళ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత నేవీ చీఫ్ గా ఉన్న ఆర్ కే ధోవన్ ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. 1978లో ఇండియన్ నేవీలో చేరిన ధోవన్ 38 ఏళ్లపాటు సేవలందించారు.