ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
తయారవుతున్న 41 నౌకలు
నేవీ అవార్డుల ప్రదానంలో నావికాదళాధిపతి సునీల్ లంబ
సాక్షి, విశాఖపట్నం: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత నావికాదళం సిద్ధంగా ఉందని భారత నావికాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లంబ స్పష్టం చేశారు. విశాఖలోని తూర్పు నావికాదళం కమాండ్ పెరేడ్ గ్రౌండ్‌లో గురువారం జరిగిన భారత నేవీ సిబ్బంది వార్షిక అవార్డుల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 33 మంది నేవీ అధికారులు, సైలర్లకు గాల్లంట్రీ, నాన్ గాల్లంట్రీ అవార్డులను ఆయన అందజేశారు. లెఫ్ట్‌నెంట్ కమాండర్లు వికాస్‌కుమార్ నర్వాల్, నీరజ్‌కుమార్, కమాండర్ వీర్‌సింగ్‌లకు నౌసేన మెడల్‌ను ప్రదానం చేశారు.
ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో హల్ అర్టిఫిసర్ రాకేష్‌కుమార్‌కు నౌసేన అవార్డు లభించగా ఆయన తరఫున అతని తల్లి అవార్డును అందుకున్నారు. నేవీ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినందుకు సర్వోత్తమ్ జీవన్ రక్ష పతక్‌ను కమాండర్ షిశిర్ కుమార్ యాదవన్నవార్‌కు ప్రకటించగా ఆయన తల్లి, భార్య కన్నీటి నడుమ అవార్డును స్వీకరించారు. ఎనిమిది నౌసేన మెడల్స్, పదహారు విశిష్ట్ సేవా మెడల్స్, సర్వోత్తమ్ జీవన్ రక్షక్ పతక్ అవార్డులు, జీవన్ రక్ష పతక్ అవార్డులు, కెప్టెన్ రవిధీర్ మెడల్ అవార్డు, లెఫ్టెనెంట్ వీకే జైన్ మెమోరియల్ గోల్డ్‌మెడల్‌ను, గడిచిన ఏడాదిలో ప్రతిభ కనబరిచిన ఆరు యూనిట్లకు అందించారు.
వేడుకలో గౌరవ వందనం స్వీకరించిన అనంతరం లంబ ప్రసంగిస్తూ.. సిబ్బంది త్యాగం, వారి కుటుంబం అందించే ప్రోత్సాహమే నావికాదళానికి బలమని చెప్పారు. ప్రపంచంలోనే భారత నావికాదళం బలంగా ఉందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు వృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. అనంతరం విలేకరులతో లంబ మాట్లాడారు. నేవీ అభివృద్ధి కోసం 15 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళిక వేశామని వెల్లడించారు. వివిధ నౌకా నిర్మాణ కేంద్రాల్లో 41 నౌకలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. తూర్పు నావికాదళాధిపతి బిస్త్, నేవీ ఉన్నతాధికారులు, సిబ్బంది, నౌకలు, సబ్‌మెరైన్లు ఈ వేడకల్లో పాలుపంచుకున్నాయి.