న్యూఢిల్లీ: భారత నేవీ దళానికి అతి కీలకమైన సేవలు అందించిన భారీ యుద్ధ వాహక నౌక ఐఎన్‌ఎస్ విరాట్ నేటితో బాధ్యతలకు గుడ్‌బై చెబుతుంది. దాదాపు 30 ఏళ్లపాటు గొప్ప సేవలు అందించిన విరాట్‌ను ఇక విధుల నుంచి విరమింపజేస్తున్నట్లు నేవీ చీఫ్ సునీల్ లంబా తెలిపారు. నాలుగు నెలల్లో దీనిని కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ కాకుంటే విడిభాగాలుగా చేసి స్క్రాప్‌కు పంపిస్తామని తెలిపారు. భారత ఆర్మీకి 30 ఏళ్లు, అంతకుముందు 27 ఏళ్లు రాయల్ నేవీకి సేవలు అందించిన విరాట్‌కు సోమవారం సాయంత్రం ముగింపు పలుకుతామని అన్నారు.
అయితే, ఈ షిప్‌ను మ్యూజియంగా మారుస్తామని గతంలో ఆంధ్రప్రదేశ్ చెప్పింది. అయితే, ఇందుకోసం దాదాపు రూ.1000 కోట్లు అవసరం అవుతాయి. గుజరాత్‌లోని అలాంగ్ ప్రాంతంలో దీనిని ఈ రోజు సాయంత్రం నిలిపి అక్కడ నుంచే కొనేవాళ్లకు అప్పగించడమా లేకుంటే స్క్రాప్‌కు తరలించడమా అనే ప్రక్రియ జరుగనుంది. మొత్తం 11 లక్షల కిలోమీటర్ల దూరాన్ని విరాట్ పూర్తి చేసిందని, ఇది మొత్తం గ్లోబును 27సార్లు చుట్టొచ్చినట్లని అన్నారు.
ఐఎన్‌ఎస్ విరాట్ ప్రత్యేకతలు..
- ఇది ప్రపంచంలోనే అతి ప్రాచీన యుద్ధ వాహక నౌక
- భారతీయ నేవీలోకి 1987లో అడుగుపెట్టింది
- దేశంలో నిర్వహించిన అన్ని మేజర్ ఆపరేషన్లలో విరాట్ పాల్గొంది
- విరాట్‌ను 1959లో బ్రిటీష్ రాయల్ నేవీ కోసం తయారుచేశారు
- ఆ సమయంలో ఫాక్లాండ్ యుద్ధంలో విజయం సాధించడంతో విరాట్‌కు గొప్ప పేరు ప్రఖ్యాతలు
- ఆ తర్వాత భారత నేవీలోకి 1987లో అడుగు
- ఈ వాహక నౌకకు 14 సార్లు మరమ్మత్తులు చేశారు
కీలక ఆపరేషన్లు
- ఆపరేషన్ జూపిటర్ (1988, శ్రీలంకతో శాంతికొనసాగింపు మిషన్)
- ఆపరేషన్ విజయ్ (1999, పోస్ట్-కార్గిల్)
- ఆపరేషన్ పరక్రామ్(2001, పార్లమెంటుపై దాడి జరిగిన సందర్భంలో) విరాట్ కీలక పాత్ర పోషించింది.
ప్రత్యేకతలు
- విరాట్ 743 అడుగుల పొడవు, 160 అడుగుల వెడల్పు, 29 అడుగుల ఎత్తు ఉంటుంది
- 16 సీ హ్యారియర్ జెట్స్, 4 సీ కింగ్ కాప్టర్స్, 2 చేతక్ చాపర్స్, 4 ధ్రువ కాప్టర్స్‌ను నిలిపే సామర్థ్యం విరాట్ సొంతం
- ఇందులోని నేవీ ఆయుధ సామాగ్రిని, యుద్ధ సామాగ్రిని బయటకు తీయడానికి ఆరు నెలల సమయం పడుతుంది.