'బందిపోటు బాంబు' అని పేరున్న సందీప్ కౌర్ అనే భారత సంతతి మహిళకు అమెరికాలోని కాలిఫోర్నియాలో 66 నెలల జైలు శిక్ష విధించారు. నాలుగు బ్యాంకులను దోచుకున్నట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఆమెకు శిక్ష తగ్గించాలని కౌర్ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు పట్టించుకోలేదు. 2014 వేసవి సమయంలో ఆమె ఈ బ్యాంకు దోపిడీలకు పాల్పడినట్లు చెబుతున్నారు. కౌర్ వయసు తక్కువని, ఆమె బాగా చదువుకుందని, ఇంతకుముందు ఎలాంటి నేరచరిత్ర కూడా లేదని న్యాయవాది విన్వర్డ్ వాదించారు. ఆమె సంప్రదాయ భారతీయ కుటుంబంలో పుట్టిందని, అనుకోకుండా ఉచ్చులో చిక్కుకుందని అన్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదని, అమెరికా వచ్చేసి తన బోయ్ఫ్రెండును పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.
స్టాక్ మార్కెట్లో కొంత సంపాదించాక, లాస్ వెగాస్లో జూదానికి అలవాటు పడిపోయి, అప్పుల్లో మునిగిపోయింది. జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె ప్రవర్తన బాగుందని, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేదని లాయర్ అన్నారు. బ్యాంకు దోపిడీలకు వెళ్లినప్పుడు కనీసం తుపాకులు కూడా తీసుకెళ్లేది కాదని చెప్పారు. అయితే.. జడ్జి మాత్రం ఆ వాదనతో ఏకీభవించలేదు. కౌర్కు 66 నెలల జైలుశిక్ష విధించారు. దాంతోపాటు, నాలుగు దోపిడీల్లో సంపాదించిన 25 లక్షల రూపాయలను తిరిగి కట్టాలని కూడా ఆదేశించారు. దోపిడీల సమయంలో బాంబులతో బ్యాంకును పేల్చేస్తానంటూ బెదిరించడం వల్లే ఆమెకు 'బందిపోటు బాంబు' అనే పేరు వచ్చిందని ఎఫ్బీఐ వర్గాలు తెలిపాయి.
'బందిపోటు బాంబు'కు 66 నెలల జైలుశిక్ష
Published Wed, Apr 8 2015 8:15 PM | Last Updated on Fri, Aug 24 2018 6:25 PM
Advertisement