షీలా పటేల్ కు కీలక పదవి
న్యూయార్క్: పద్మశ్రీ అవార్డు గ్రహిత, స్పార్క్ (సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఏరియా రిసోర్స్) వ్యవస్థాపకురాలు షీలా పటేల్ ‘ఐక్యరాజ్యసమితి పట్టణ పేదరిక నిర్మూలన’ కమిటీకి అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పట్టణ మురికి వాడలపై అధ్యయనం చేసి ఈ కమిటీ నివేదికను ఇవ్వనుంది.
ముంబైకి చెందిన షీలా 1984 నుంచి పట్టణాల్లో ఉండే మురికి వాడల నిర్మూలనకు కృషి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మురికివాడల్లో ఉన్న స్త్రీలను ఏకం చేసిన కార్యక్రమం ‘మహిళ మిలన్’తో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆసియా, ఆఫ్రికాలో ఉన్న మురికి వాడలకు సౌకర్యాలు కల్పించే స్వచ్ఛంద సంస్థ ‘స్లమ్ డ్వెల్లర్ ఇంటర్నేషనల్’ (ఎస్‌డీఐ)కి ఆమె ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నారు.
‘మనం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ శైలికి అలవాటు పడిపోయాం. ఎందుకుంటే ఇప్పటికే ప్రపంచంలో సగం వరకు జనాభా నగరాలకు వలసవెళ్లింది. అందరికి సమాన అవకాశాలు కల్పించాలి. 2016లో ఈక్వెడార్ జరిగిన సమావేశాల్లో తీసుకున్న పట్టణాల్లో అందరికి ఇళ్లు, సమ్మిళిత వృద్ధి విధానానికి షీలా ఆధ్వర్యంలోని కమిటీ పనిచేస్తుంది’ అని యూఎన్ సెక్రటరీ జనరల్ అంటానియో గ్లుటెరస్ అన్నారు. షీలా ప్రఖ్యాత రాక్‌ఫెల్లర్ నాయకత్వ అవార్డును గతంలో అందుకున్నారు.