ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఔట్?
ట్రిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఔట్?
Published Mon, Aug 5 2013 3:16 AM | Last Updated on Mon, Dec 3 2018 1:54 PM
ముంబై: ఇటీవల వరుసగా పతనమవుతున్న షేర్ల ధరల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల విలువ మార్క్‌ను కోల్పోయే ప్రమాదంలో పడ్డాయ్. ఇందుకు డాలరుతో మారకంలో రూపాయి పతనంకూడా ప్రభావం చూపుతోంది. నిజానికి ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన స్టాక్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా 14 ఉన్నాయి. వీటిలో ఇండియాకు సైతం సభ్యత్వం ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశీయ మార్కెట్ల విలువ 1.004 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. వెరసి ఇకపై షేర్ల ధరలు లేదా రూపాయి విలువ పతనమైతే తృటిలో ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను కోల్పోయే అవకాశముంది.
గత వారం అటు స్టాక్ మార్కెట్లు క్షీణించడంతోపాటు, ఇటు రూపాయి విలువ కొత్త కనిష్టానికి పతనమైన నేపథ్యంలో మార్కెట్ల విలువ రూ. 61,36,641 కోట్లకు(ఒక ట్రిలియన్ డాలర్లు) పరిమితమైంది. ఈ ఏడాది ఏప్రిల్ మొదలు స్టాక్ మార్కెట్లు 4% క్షీణించగా, రూపాయి విలువ 12% పడిపోయింది. అమెరికా టాప్: ప్రస్తుతం ఇండియాసహా ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల స్టాక్ మార్కెట్లు ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో నమోదయ్యాయి.
20 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో అమెరికా టాప్ ర్యాంక్‌లో నిలవగా, తదుపరి స్థానాల్లో యూకే, జపాన్, చైనా, కెనడా, హాంకాంగ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా తదితరాలున్నాయి. 2007లో తొలిసారి ఇండియా ఈ క్లబ్‌లో సభ్యత్వాన్ని పొందింది. ఆపై 2008 సెప్టెంబర్‌లో ర్యాంక్‌ను కోల్పోయినప్పటికీ తిరిగి 2009 మే నుంచీ క్లబ్‌లో కొనసాగుతోంది.
Advertisement
Advertisement