కదిలి వస్తున్న మైనపు బొమ్మలు | Indias first Madame Tussauds museum to open in Delhi in June | Sakshi
Sakshi News home page

కదిలి వస్తున్న మైనపు బొమ్మలు

Published Thu, Jan 12 2017 5:26 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

Indias first Madame Tussauds museum to open in Delhi in June


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యక్తుల మైనపు బొమ్మలను తయారు చేసే మేడమ్‌ టస్సాడ్స్ మ్యూజియం భారత్‌లో ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది జూన్‌కల్లా మ్యూజియాన్ని దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు మాతృ సంస్థ మెర్లిన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలిపింది. ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే కనాట్‌ప్లేస్ ప్రాంతంలోని రీగల్ థియేటర్లోని రెండు అంతస్థులలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేస్తారు. రాబోయే పదేళ్లలో 418 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించనున్నట్లు మెర్లిన్‌ అధికార ప్రతినిధి మార్కెల్‌ క్లూస్‌ తెలిపారు. తొలుత దాదాపు 50 మంది సెలబ్రిటీల బొమ్మలతో ఏర్పాటు కానున్న ఈ మ్యూజియంలో 60 శాతం బొమ్మలు స్థానిక సెలబ్రిటీలవి కాగా 40 శాతం అంతర్జాతీయ ప్రముఖులవి ఉండనున్నాయి. 
 
బ్రిటన్‌కు చెందిన మెర్లిన్‌ ఎంటర్‌టైనర్స్‌ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 24 దేశాల్లో 116 మ్యూజియాలను నిర్వహిస్తోంది. కంపెనీ ఇండియా అధికార ప్రతినిధి అన్షుల్ జైన్‌ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో లెగో ల్యాండ్, సీ లైఫ్‌ వంటి ప్రత్యేక ఆకర్షణలను కూడా భారత్‌కు తీసుకువస్తామని తెలిపారు.ఈ మైనపు బొమ్మలను ఒక్కొక్కదాన్ని తయారుచేయడానికి రూ.1.50 కోట్లు ఖర్చవుతాయని ఆయన అన్నారు. ఇండియాలో ఏర్పాటు చేయనున్న ఈ మ్యూజియంతో ఆసియాలో వీటి సంఖ్య 9కి చేరుకోనుంది. లండన్‌లోని మ్యూజియం ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే భారత్‌కు చెందిన అమితాబ్‌, ఐశ్వర్యారాయ్‌, కరీనా కపూర్‌, హృతిక్‌ రోషన్‌, షారుఖ్‌ఖాన్‌ మైనపు బొమ్మలు ఉన్న విషయం తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement