
జయలలిత కోసం ఇందిరా గాంధీ వచ్చారు
న్యూఢిల్లీ: జయలలిత మృతికి పార‍్లమెంట్ ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆమెకు నివాళులు అర్పించిన అనంతరం పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. 1984లో రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న జయలలిత జ్ఞాపకాలను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ గుర్తుచేసుకున్నారు. ఆ ఏడాది రాజ‍్యసభలో జయలలిత ప్రసంగించారని చెప్పారు. జయలలిత ప్రసంగం వినడం కోసం నాటి ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యసభకు వచ్చారని కురియన్ వెల్లడించారు. రాజ్యసభలో జయలలిత ప్రసంగించడం అదే తొలిసారని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను లోక్‌సభ సభ్యుడిగా ఉన్నానని చెప్పారు.
‘జయలలిత ప్రసంగించినపుడు గ్యాలరీ పూర్తిగా నిండిపోయింది. ఆమె ప్రసంగానికి సభికులు ముగ్ధులయ్యారు. అందరూ ఆమెను అభినందించారు. ఆ రోజు ఆదో పెద్ద వార్త అయ్యింది. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన జయలలిత అంత అద్భుతంగా మాట్లాడుతారని ఎవరూ ఊహించలేకపోయారు. ప్రజల హృదయాల్లో జీవించిన నాయకురాలు ఆమె. పేద ప్రజల కోసం, మహిళా సాధికారత కోసం ఎనలేని కృషి చేశారు’ అని కురియన్ అన్నారు.