ఇంద్రాణి ముఖర్జియా(ఫైల్)
ముంబై: తన కుమార్తె షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే ట్రీట్ మెంట్ కు ఆమె స్పందిస్తున్నారని జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే వెల్లడించారు. ఇప్పటికీ ఆమె అపస్మారక స్థితిలో ఉన్నారని, ఆమెను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇంద్రాణి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టి చూస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై లేదని, తనంతట తాను ఊపిరి తీసుకోలేకపోవడం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు జైల్లో ఇంద్రాణి వద్దకు మోతాదుకు మించి మాత్రలు ఎలా చేరాయనే దానిపై జైళ్ల శాఖ ఐజీ దర్యాప్తు ప్రారంభించింది. ఆస్పత్రిలో ఉన్న ఇంద్రాణిని కలిసేందుకు అనుమతించాలంటూ ఆమె తరఫు న్యాయవాది స్థానిక కోర్టును ఆశ్రయించారు.