ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మాజీ మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియా సైలెంట్ కిల్లర్‌లా వ్యవహరించారని సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. సవతి కూతురును దారుణంగా హత్య చేయించారనే ఆరోపణలతో 2015లో పీటర్ అరెస్టైన సంగతి తెలిసిందే. షీనా తల్లి, పీటర్ రెండో భార్య ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలిగా ఉన్న ఈ కేసులో తనకు బెయిలు కావాలంటూ పీటర్ మరోసారి అప్పీలు చేశారు. ఈ క్రమంలో షీనా బోరా హత్యకేసు శుక్రవారం మరోసారి సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది.(వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..)
ఈ నేపథ్యంలో పీటర్‌కు బెయిలు నిరాకరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ భరత్ బదామీ కోర్టుకు విఙ్ఞప్తి చేశారు. ఈ కేసులో పీటర్ ముద్దాయి అని నిరూపించడానికి సీబీఐ వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నాయని విన్నవించారు. షీనా హత్య జరిగినపుడు తన క్లైంట్ లండన్‌లో ఉన్నారని పీటర్ న్యాయవాది పేర్కొనగా.. ఇందుకు ప్రతిగా భరత్ వాదిస్తూ 26/11 ముంబై పేలుళ్ల కేసును ప్రస్తావించారు. ‘లష్కర్ ఏ తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్‌లో ఉన్నప్పటికీ అతడికి ఈ పేలుళ్ల కేసుతో సంబంధం లేదని చెప్పలేం. అలాగే పీటర్ లండన్‌లో ఉన్నప్పటికీ అతడు షీనా కేసులో నిందితుడు కాకుండా పోడు’ అని వాదించారు. ‘ పీటర్‌కు అన్నీ తెలుసు. తన కొడుకు రాహుల్ షీనా గురించి ఆరా తీసినపుడే మందలించి ఉండాల్సింది. పీటర్ ఓ సైలెంట్ కిల్లర్. కొడుకును మార్చకుండా అతడు ఏం చేశాడు మరి’ అని భరత్ తన వాదనలు వినిపించారు. దీంతో ఆయన బెయిలు అప్పీలు మరోసారి తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది.(‘ఆ రెండు రోజులు ఎవరినీ ఫ్లాట్‌లోకి రానివ్వలేదు’)
షీనా బోరా హత్య కేసు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా హతమార్చేందుకు జరిగిన కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నందుకే షీనాను హత్య చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment