షీనా బోరా మర్డర్‌ కేసు: ట్విస్టుల మీద ట్విస్టులు.. | Sheena Bora Murder Case: A Timeline With Twists And Turns | Sakshi
Sakshi News home page

షీనా బోరా హత్య కేసు: ట్విస్టుల మీద ట్విస్టులు, పోలీస్‌ డైరీలో ఏముందంటే..

Published Sat, May 21 2022 8:11 PM | Last Updated on Sat, May 21 2022 8:37 PM

Sheena Bora Murder Case: A Timeline With Twists And Turns - Sakshi

సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేదిగా ఉండడం వల్లే షీనా బోరా హత్య కేసు.. దేశంలో అంతగా సంచలనం సృష్టించించింది. మూడేళ్ల తర్వాత హత్యోదంతం వెలుగులోకి వస్తే.. కేసులో ప్రధాన నిందితురాలిగా జైల్లో ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ ఆరున్నరేళ్ల తర్వాత ఇప్పుడు బెయిల్‌ మీద బయటకు వచ్చింది. మీడియా ఎగ్జిక్యూటివ్‌గా సొసైటీలో మంచి పేరున్న ఇంద్రాణీ..  సొంత కూతురు షీనాను హత్య చేసేందుకు ఎన్ని ప్లాన్లు వేసింది? ఏది వర్కవుట్ అయింది? పోలీస్‌ డైరీ ఆధారంగా.. 

షీనా బోరా హత్యకేసులో కీలకసూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఆమె కన్నతల్లి ఇంద్రాణీ ముఖర్జీ. రెండో భర్త సంజీవ్‌ఖన్నాతో కలిసి ఇంద్రాణీ ఈ హత్యకు కుట్రపన్నినట్లు ఇప్పటివరకు జరిగిన పోలీసుల విచారణలో తేలింది. అసలు షీనాను ముంబైలోని ఆమె ఇంట్లోనే హత్యచేయాలని సంజీవ్‌ఖన్నా సూచించారు. కానీ, ఆ ఇంట్లో షీనాతోపాటు తన భర్త(మూడో భర్త) పీటర్‌ ముఖర్జియా, కొడుకు రాహుల్‌ ముఖర్జియా కూడా ఉన్నందువల్లే ఇంద్రాణి ఆ ప్లాన్‌కు ఒప్పుకోలేదు. ఈ కేసులో రాహుల్‌ పేరు రావడం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేదు. 

అయితే పీటర్‌ ముఖర్జియా ముంబైలో లేని సమయం చూసి.. షీనాను ఇంటికి పిలిచి హత్యచేయాలని ఇంద్రాణీ సంజీవ్‌కు సూచించింది. అయితే సొంతింట్లో హత్యజరిగితే పోలీసులు ఇంద్రాణీని అనుమానించే అవకాశం ఉండడంతో వద్దని సంజీవ్‌ఖన్నా ఆమెను వారించాడు. దీంతో ఇద్దరూ కలిసి... కారులోనే షీనాను హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం డ్రైవర్‌ శ్యాంరాయ్‌ను చేర్చుకుని హత్యకు కుట్ర పన్నారు.

ఈ హత్యకేసులో ముగ్గురు నిందితుల వాంగ్మూలాలతో పాటు... కాల్‌డాటా రికార్డులను పోలీసులు పోల్చిచూశారు.  23 ఏప్రిల్ 2012న జరిగిన సంఘటనలతో ఓ టైం లైన్‌ తయారు చేశారు.

అది.. ఏప్రిల్‌ 23, 2012.. 
ఉదయం 9గంటలు:
డ్రైవర్‌ శ్యాంరాయ్‌తో కలిసి ఇంద్రాణీ ముఖర్జీ.. రాయ్‌గఢ్ అడవుల్లోకి వెళ్లి రెక్కీ నిర్వహించింది. షీనాను హత్యచేశాక మృతదేహం ఎక్కడ పారేయ్యాలో నిర్ణయించుకుంది. 

ఉదయం 11.30నిమిషాలకు: రెండో భర్త సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసిన ఇంద్రాణి.. దాదాపు 7నిమిషాలు మాట్లాడింది. 

ఉదయం 11.37నిమిషాలకు: ముంబైలోని వర్లీ ప్రాంతంలో ఉన్న హిల్‌టాప్‌ హోటల్‌లో సంజీవ్‌ఖన్నా కోసం ఇంద్రాణి ఓ రూమ్‌ బుక్‌ చేసింది.

అది.. ఏప్రిల్‌ 24,  2012.. 

మద్యాహ్నం 1.47నిమిషాలకు: సంజీవ్‌ ఖన్నా కోల్‌కతా నుంచి ముంబై చేరుకుని... ట్యాక్సీలో హిల్‌టాప్‌ హోటల్‌ చేరుకున్నాడు. 

మద్యాహ్నం 1.53నిమిషాలకు:  ఇంద్రాణికి కాల్‌చేసి తాను ముంబై చేరుకున్నానని చెప్పిన సంజీవ్‌ఖన్నా

మద్యాహ్నం 2.38నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు ఫోన్‌చేసి రూమ్‌లో సదుపాయాలు సరిగానే ఉన్నాయా అని అడిగి తెలుసుకుంది ఇంద్రాణి.

మద్యాహ్నం 3.11నిమిషాలకు: మరోసారి రెండోభర్త సంజీవ్‌ఖన్నాకు కాల్‌చేసి... హత్యకు సంబంధించి ప్లాన్‌పై డిస్కస్‌ చేసింది ఇంద్రాణి. 

సాయంత్రం 6గంటలకు: హిల్‌టాప్‌ హోటల్‌ నుంచి సంజీవ్‌ఖన్నాను హిల్‌టాప్‌ హోటల్‌ నుంచి పికప్‌ చేసుకుంది. ఇంద్రాణి డ్రైవర్‌ శ్యాంమనోహర్‌ కారు డ్రైవ్‌ చేస్తున్నారు. 

సాయంత్రం 6.45 నిమిషాలకు: ముంబైలోని లింకింగ్‌ రోడ్‌ చేరుకున్న ముగ్గురు... షీనాబోరా కోసం ఎదురుచూశారు. 

సాయంత్రం 7.03 నిమిషాలకు: లింకింగ్‌ రోడ్‌లోని నేషనల్‌ కాలేజ్‌ సమీపంలో తన కోసం వెయిట్‌ చేస్తున్న ఓపెల్‌ కోర్సా కారులో కూర్చుంది షీనా.

సాయంత్రం 7.16నిమిషాలకు: ఇంద్రాణి సూచన మేరకు డ్రైవర్‌ శ్యాం మనోహర్ నవీ ముంబై వైపు కారు నడిపాడు. అక్కడి నుంచి కారు ఐరోలీ వైపు ప్రయాణించింది. 

రాత్రి 8.27 నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కారు వేగంగా వెలుతున్న సమయంలో...  కారు ఆపాల్సిందిగా డ్రైవర్‌ను ఇంద్రాణి  ఆదేశించింది. అయితే అప్పటికే షీనాబోరాకు  ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నాలు మత్తు మందు ఇచ్చిన విషయం డ్రైవర్‌కు తెలియదు. దీంతో తాను టాయిలెట్‌కు వెళతానని చెప్పి డ్రైవర్‌ శ్యాంమనోహర్ కారు దిగి వెళ్లాడు. డ్రైవర్‌ వెళ్లగానే  ఇంద్రాణీ తన కూతురు షీనా చేతులు గట్టిగా పట్టుకుంది. సంజీవ్‌ఖన్నా షీనా గొంతు నులిమి చంపేశాడు. డ్రైవర్ టాయిలెట్‌కు వెళ్లి తిరిగి రాగానే కారును దూరంగా పోనివ్వమని.. ఇంద్రాణి చెప్పింది.  అయితే అప్పటికే చీకటి కావడంతో తమ ప్లాన్‌ మార్చుకోవాలని ఇంద్రాణీ, సంజీవ్‌లు నిర్ణయించుకున్నారు. రాయ్‌గఢ్‌ వెళ్లడం కష్టం కాబట్టి దగ్గరలో ఉన్న లోనావాలా అటవీ ప్రాతంలోనే శవాన్ని పూడ్చిపెడదామని సంజీవ్‌ అన్నాడు. 

రాత్రి 9.01నిమిషాలకు: ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌ హైవేలోని విఖ్రోలి ప్రాంతంలో పోలీస్‌ గస్తీని చూడగానే వీరు ముగ్గురు భయపడ్డారు. 

రాత్రి 9.14నిమిషాలకు: వెంటనే యూటర్న్ తీసుకుని తిరిగి వర్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాత్రి శవాన్ని కారులోనే ఉంచి పీటర్‌ ముఖర్జియా ఇంట్లోని గ్యారేజ్‌లో ఉంచాలని నిర్ణయించుకున్నారు. 

రాత్రి 11.01 నిమిషాలకు: షీనా మృతదేహాన్ని ఒక బ్యాగులో కుక్కి... కారు డిక్కీలో ఉంచారు. 

అది.. ఏప్రిల్ 25,  2012

అర్థరాత్రి 12.19నిమిషాలకు:  సంజీవ్‌ఖన్నా తన హిల్‌టాప్‌ హోటల్‌కు బయలేదేరాడు

అర్ధరాత్రి 12.30నిమిషాలకు: సంజీవ్‌ఖన్నాకు కాల్‌చేసిన ఇంద్రాణి... ఉదయం ఏంచేయాలనే దానిపై ఇద్దరు చర్చించుకున్నారు. 

అర్ధరాత్రి12. 57నిమిషాలకు: కారులోనే ఉన్న డ్రైవర్‌ శ్యామ్‌రాయ్‌కు ఫోన్‌చేసింది ఇంద్రాణి.

అర్ధరాత్రి 01.19నిమిషాలకు: మరోసారి డ్రైవర్‌ శ్యాంరాయ్‌కు ఫోన్‌ చేసిని ఇంద్రాణి... బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. 

అర్ధరాత్రి 02.30నిమిషాలకు: తన గదిలోంచి కిందికి దిగివచ్చిన ఇంద్రాణీ... డ్రైవర్‌తో కలిసి హిల్‌టాప్‌ హోటల్‌కు బయలుదేరి వెళ్లింది. 

అర్ధరాత్రి  02.47 నిమిషాలకు: రాయ్‌గఢ్‌లోని  గగోడే బుద్రుక్‌ గ్రామానికి బయలుదేరిన ఇంద్రాణీ, సంజీవ్‌ఖన్నా, డ్రైవర్‌ శ్యాంరాయ్‌.

తెల్లవారుజామున 04.21 నిమిషాలకు: గగోడే బుద్రుక్‌ గ్రామ సమీపంలో చేరుకోగానే... కారులోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. తన కూతురు శవాన్ని చూసి భయపడ్డ ఇంద్రాణీ.. వెంటనే శవాన్ని దహనం చేయాలని చెప్పింది. 

తెల్లవారుజామున 04.33నిమిషాలకు: కారు దగ్గరికి వెళ్లి నిల్చున్న ఇంద్రాణి... సంజీవ్‌ఖన్న, శ్యాంరాయ్‌లు శవాన్ని మట్టుబెట్టేవరకు ఎదురుచూసింది. 

ఉదయం 05.13నిమిషాలకు: అక్కడి నుంచి బయలుదేరిన ముగ్గురు కొద్దిదూరం వెళ్లి... తిరిగి శవాన్ని మట్టుబెట్టిన ప్రాంతంలో ఎవరైనా మనుషులు ఉన్నారా చూసి ఇంటికి బయలుదేరారు. 

ఉదయం 07.33నిమిషాలకు:  ముంబై చేరుకున్న ముగ్గురు ఎవరి గమ్యస్థానాలకు వారు వెళ్లిపోయారు. 

చదవండి:  పీటర్ మొదటి భార్య కొడుకు రాహుల్‌తో షీనా సన్నిహితంగా ఉండడం వల్లే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement