కోచి: కేరళలో ఇసుక మాఫియాపై ఓ మహిళ సడలని పట్టుదలతో ఒంటరిగా పోరాడుతోంది.అక్రమ వ్యాపారులు తమ రాజకీయ పలుకుబడితో ఆమె నోరు మూయించేందుకు ప్రయత్నించినా తల వంచలేదు. ఆమె సాహసాన్ని అభినందించిన కేరళ పారిశ్రామికవేత్త రూ.5 లక్షల పారితోషికం ప్రకటించారు. కన్నూర్‌లోని పుథియువన్‌గాడికి చెందిన జజీరా(31) తమ ఊరిలో ఇసుక దందాపై ఎలుగెత్తింది. కన్నూరు, తిరువనంతపురంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించి ఫిర్యాదు చేసింది. కేరళ సచివాలయం ఎదుట ఉద్యమించింది.
అయితే అక్రమ వ్యాపారులు తమ పలుకుబడితో దీన్ని అణచివేసేందుకు ప్రయత్నించటంతో వేదికను దేశ రాజధానికి మార్చింది. ముగ్గురు చిన్న పిల్లలున్నా ధైర్యంగా ఢిల్లీ నుంచే పోరాడింది. వణికించే చలి సైతం ఆమె పట్టుదల ముందు తలవంచింది. తన ఊరిలో ఇసుక దందాను అరికడతామని ప్రభుత్వం ప్రకటించేవరకూ కేరళ హౌస్ ఎదుట పోరాటం కొనసాగిస్తానని ప్రకటించింది. జజీరాకు కేరళ పారిశ్రామికవేత్త, వీ-గార్డ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్, ఎండీ కోచుసెఫ్ చిట్టిలాపిళై ్ల రూ.5 లక్షల పారితోషికం ప్రకటించారు.