సెల్‌ఫోన్లతో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి!
సెల్‌ఫోన్లతో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి!
Published Fri, Feb 3 2017 3:18 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
ఆస్పత్రులంటే అత్యంత పరిశుభ్రంగా ఉండాలి. లోపలున్న పేషెంట్లకు ఏమాత్రం ఇన్ఫెక్షన్లు సోకకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ తీసుకుంటూ, ప్రతి గంటలకు ఫ్లోరింగును సైతం శుభ్రం చేస్తూ అప్రమత్తంగా ఉంటున్నా కూడా సెల్‌ఫోన్ల వాడకం వల్ల 81.8 శాతం బ్యాక్టీరియల్ పాథోజెన్‌లు వ్యాప్తి చెందుతున్నాయట. ఈ విషయం తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వేలో తేలింది. మొబైల్ ఫోన్ల వల్ల 81.8 శాతం, హ్యాండ్ స్వాబ్‌ల వల్ల 80 శాతం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నట్లు ఆ సర్వే తెలిపింది.
ఒకే మొబైల్ ఫోన్‌ను పలువురు ఉపయోగించడం వల్లే ప్రధానంగా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయట. ఒకరు వాడినప్పుడు వాళ్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా ఫోన్‌కు అంటుకుంటుందని, చేతులను ఏమాత్రం శుభ్రం చేసుకోకుండానే అదే ఫోన్‌ను వేరొకరు వాడితే వారికి కూడా ఆ ఇన్ఫెక్షన్ వస్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. దాంతో ఆస్పత్రులలో ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి పాటించాల్సిన సూత్రాలను ఐసీఎంఆర్ విడుదల చేసింది. ఇవి ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు.
Advertisement
Advertisement