ఆర్టీసీ సర్వీసులపైనే పీటముడి
- కొలిక్కిరాని రవాణా మంత్రుల చర్చలు
- ఖరారుకాని అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందం
- మళ్లీ హైదరాబాద్‌లో భేటీకి నిర్ణయం
- అప్పటికి ‘అంతర్రాష్ట్ర’ ఒప్పందం కొలిక్కి వస్తుందని ఆశాభావం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రవాణా శాఖల మంత్రుల మధ్య బుధవారం విజయవాడలో ఓ ప్రైవేటు హోటల్లోని జరిగిన సమావేశం ఎటువంటి ఫలితాన్నివ్వలేదు. ఉభయరాష్ట్రాల మధ్య మూడేళ్లుగా నలుగుతున్న అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందం కొలిక్కిరాలేదు. సరికదా ఆర్టీసీ సర్వీసులపై పీటముడి పడింది. ఏపీ, తెలంగాణల రవాణా మంత్రులు అచ్చెన్నాయుడు, మహేందర్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సుమితా దావ్రా, సునీల్‌శర్మ, ఏపీ రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఆర్టీసీ ఎండీలు మాలకొండయ్య, రమణరావులు సమావేశమయ్యారు.
ఇరు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు, ఆర్టీసీ సర్వీసులపై ప్రధానంగా చర్చించారు. విభజనానంతరం రెండు రాష్ట్రాలమధ్య రవాణారంగ వాహనాలు, ప్రైవేటు బస్సులపై పరస్పర ఒప్పందం జరగలేదు. అప్పటి నుంచి అంతర్రాష్ట్ర పర్మిట్ల విధానం తెరపైకొచ్చి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అధికారులు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తాత్కాలిక పర్మిట్లతోనే రవాణా సాగుతోంది. సింగిల్ పర్మిట్ విధానం అమలుపై ఇరు రాష్ట్రాల రవాణా అధికారుల మధ్య పలు మార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తాజా భేటీలోనూ ఆర్టీసీ సర్వీసుల విషయంలో అభిప్రాయ భేదాలు కొనసాగినట్టు సమాచారం.
ఏపీ సర్వీసులు తెలంగాణలో 700 తిరుగుతుంటే, తెలంగాణ సర్వీసులు 400 మాత్రమే తిరుగుతున్నాయంటూ మంత్రి మహేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.హైదరాబాద్‌కు బస్సులు నడపడం వల్లే ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రధానంగా ఆదాయం సమకూరుతోందని, అందువల్ల సర్వీసులను తగ్గించుకోవడం సాధ్యపడదని ఏపీ ఆర్టీసీ అధికారులు వాదించారు. అయితే ఆర్టీసీ సర్వీసుల విషయంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల స్థాయిలో గురువారం చర్చలు జరపాలని తాజా భేటీలో నిర్ణయించారు. రవాణారంగ సమస్యలపై 5 అంశాలు చర్చకొచ్చాయని, 4 అంశాలపై సానుకూలంగా అభిప్రాయాలు వ్యక్తమైనట్లు రవాణాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో మళ్లీ భేటీ..
సమావేశానంతరం రెండు రాష్ట్రాల రవాణా మంత్రులు అచ్చెన్నాయుడు, మహేందర్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ.. సరుకు రవాణా వాహనాలు, కాంట్రాక్టు క్యారేజీ బస్సుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటి వారంలో హైదరాబాద్‌లో మరలా భేటీ అవుతామని, అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న సిబ్బందిలో చాలామంది.. భార్య ఓ రాష్ట్రంలో భర్త మరో రాష్ట్రంలో పనిచేస్తున్నారని, వీరి సమస్యతోపాటు స్థానికతపై చర్చించామని అచ్చెన్నాయుడు వివరించారు.
ఆర్టీసీ సర్వీసులపై లోతుగా చర్చించి పరిష్కార అమలుకు మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసులను కొంతమేరకు కుదించి, తెలంగాణ సర్వీసులు పెంచుకునేలా సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తామని చెప్పారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆర్టీసీ రూట్ల విషయంలో జూన్‌లో పునఃసమీక్ష జరుగుతుందని, అప్పటివరకు యథాస్థితి కొనసాగించాలని ఏపీ ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య కోరారు. ఆ సమీక్షలో సర్వీసుల కుదింపు, పొడిగింపుపై నిర్ణయం తీసుకుందామని సూచించారు.