Interstate transport
-
అంతర్రాష్ట్ర ప్రయాణం సులభతరం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలను మరింత సులభతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో ప్రత్యేకంగా నియమనిబంధనలు విధించాయి. క్వారంటైన్, ఐసోలేషన్ వంటివి అమలుచేశాయి. అయితే కరోనా కేసుల ఉధృతి తగ్గడంతో ప్రయాణాలను సులభతరం చేయాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. విమాన, రైలు, బస్సు ప్రయాణాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏకీకృత ప్రొటోకాల్స్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది. వీటిని అన్ని రాష్ట్రాలు అనుసరించాలని సూచించింది. సులభతరం చేయడమంటే, ఇష్టారాజ్యంగా ప్రయాణికులు తిరగడమన్న ఉద్దేశం కాదని, అవసరమైన ఆరోగ్య ప్రొటోకాల్స్‌ను తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా రాష్ట్రంలో అసాధారణంగా కరోనా కేసులు పెరిగిన సందర్భాల్లో తగిన ప్రజారోగ్య చర్యలను వెంటనే ప్రారంభించవచ్చు. అటువంటప్పుడు స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు అదనపు ఆంక్షలను అమలు చేయవచ్చు. మార్గదర్శకాలు ఇవీ... ►ప్రయాణికులు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. కోవిడ్ సంబంధిత లక్షణాలు లేనప్పుడు మాత్రమే ప్రయాణించాలి. మాస్క్, హ్యాండ్ హైజీన్, భౌతికదూరం పాటించాలి. ►ప్రయాణ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు. ►ప్రయాణికులందరూ తమ మొబైల్లో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ►ప్రయాణ సమయంలో వారికి జ్వరం వచ్చినట్లయితే, వారు సంబంధిత విమాన సిబ్బందికి లేదా రైలు టీటీఈకి లేదా బస్ కండక్టర్‌కు తెలియజేయాలి. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తే, కోవిడ్ కాల్ సెంటర్‌కు వివరాలు ఇవ్వాలి. ►విమానాశ్రయాలు/రైల్వే స్టేషన్లు/పోర్టులు/బస్ స్టేషన్లలో కరోనాకు సంబంధించిన ప్రకటనలు జారీచేయాలి. ►ప్రయాణికులందరూ బయలుదేరే సమయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే విమానం/రైలు/ఓడ/బస్సు ఎక్కడానికి అనుమతిస్తారు. ►ప్రయాణికులకు శానిటైజర్లు, మాస్క్‌లను అందుబాటులో ఉంచాలి. ►ప్రయాణం తర్వాత బయటకు వెళ్లేవారికి థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి. లక్షణాలు లేని ప్రయాణికులు 14 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలనే సలహా ఇవ్వాలి. ►ఒకవేళ ప్రయాణికుల్లో ఎవరికైనా లక్షణాలుంటే, వారిని ఐసోలేట్ చేయాలి. అవసరమైతే రోగులను తగిన ఆసుపత్రికి తరలించాలి. ►అవసరమైన రోగులకు పల్స్ ఆక్సిమీటర్, థర్మామీటర్ అందుబాటులో ఉంచాలి. శిక్షణ పొందిన సిబ్బంది కూడా ఉండాలి. ►ప్రయాణికులు ఆప్రాన్ వాడాల్సిన అవసరంలేదు. అయితే ఎయిర్‌లైన్/రైల్వే కోచ్/షిప్ క్యాబిన్లు/బస్సులో సిబ్బంది మాత్రం ఎల్లప్పుడూ మాస్క్‌లు, ఫేస్ షీల్డ్, గ్లౌజులు ధరించాలి. ఇతర తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ►విమానాలు/రైళ్లు/నౌకలు/బస్సులను క్రమం తప్పకుండా శానిటైజ్ చేయాలి. ►రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య విమానాలు, రైలు, రహదారి ద్వారా జరిగే అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ►ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో ప్రవేశించడానికి ముందు ఆర్టీపీసీఆర్ లేదా యాంటీజెన్ పరీక్షలు అవసరమైతే, విస్తృతంగా ప్రచారం చేయాలి. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులను వేసుకున్నవారిని మినహాయించాలి. -
అంతరాష్ట్ర ప్రయాణాలపై ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. మహమ్మారి కట్టడి కోసం పలు రాష్ట్రాలు లాక్డౌన్ విధించడంతో పాటు.. అంతరాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ఇతర రాష్ట్రాల వారు తమ ప్రాంతంలోకి ప్రవేశించాలంటే కోవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేశాయి. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ అంతరాష్ట్ర ప్రయాణాలకు సంబందించి కీలక సూచనలు చేసింది. పూర్తి ఆరోగ్యంగా ఉండి.. ఒంటరిగా అంతరాష్ట్ర ప్రయాణాలు చేసేవారికి ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ అవసరం లేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. తాజా ఉత్తర్వులు ఒంటరిగా అంతరాష్ట్ర ప్రయాణాలు చేసే వారికి ఎంతో ఊరటనిస్తాయి. ఇప్పటికే లాక్డౌన్ విధించిన పలు రాష్ట్రాల్లో ప్రయాణాలకు ఈ పాస్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దాంతో సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలున్న వారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. అత్యవసరం అనుకున్న వారు టెస్ట్‌లకు వెళ్తున్నారు. దాంతో కోవిడ్ పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ పెరుగుతుంది. దేశంలో పెరుగుతున్న కేసులతో ఇప్పటికే పరీక్షా కేంద్రాలపై ఒత్తిడి పెరిగింది. దీన్ని తగ్గించడం కోసమే ఐసీఎంఆర్ ఈ ప్రకటన చేసింది. ఆర్టీపీసీఆర్ ద్వారా ఒక్కసారి పాజిటివ్ వచ్చిన వ్యక్తికి తరచుగా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్న వ్యక్తికి డిశ్చార్జ్ సమయంలో మరోసారి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, సీబీఏనాట్తో పాటు ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో కలిపి మొత్తం 2,506 మాలిక్యులర్ టెస్టింగ్ లాబొరేటరీలు ఉన్నాయి. ప్రతి రోజు మూడు-షిఫ్ట్‌ల ద్వారా 15 లక్షల పరీక్షలు చేయగల సామార్థ్యం వీటి సొంతం. చదవండి: కరోనా ప్రళయం.. భయం గుప్పిట్లో ప్రజలు! -
ముగిసిన ఆర్టీసీ భేటీ.. వీడని సందిగ్ధత
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసు ఒప్పందాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే సమావేశాన్ని ముగించారు. హైదరాబాద్‌లోని బస్ భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు భేటీ అవ్వగా.. 2.65 లక్షల కిలోమీటర్లకు 65 వేల తగ్గించుకుంటామని గతంలో చెప్పిన ఏపీ మరో 40వేల కిలోమీటర్లు తగ్గించుకునేందుకు సుముఖత వ్యక్తం చేసింది. చదవండి: ఆర్టీసీ సిబ్బంది విభజనలో ‘సుప్రీం’ స్టే అయితే తాజాగా తాము లక్ష 61 వేల కిలోమీటర్ల నడుపుకుంటామని మీరు(ఏపీ) కూడా లక్ష 61వేల కిలోమీటర్లు నడుపుకొండని టీఎస్ఆర్టీసీ అధికారులు ఏపీ ఆర్టీసీ అధికారులకు సూచించారు. దీనిపై ఆలోచించిన ఏపీ అధికారులు మరోసారి నిర్ణయం తీసుకొని భేటీ అవుతామని చెప్పారు. కాగా దసరా పండక్కి బస్సులపై తెలంగాణ అధికారులకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. చదవండి: మరోమారు చర్చలు.. బస్సులు నడిచేనా? -
అంతరాష్ట్ర బస్సులు: మంత్రుల భేటీ లేదు
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో సోమవారం ఎలాంటి మంత్రుల స్థాయి సమావేశం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం ఫిక్స్ చేయలేదు. కిలోమీటర్ బేసిస్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల సమావేశం జరుగుతుంది. అప్పటిదాకా కేవలం అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతాయి’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడపడానికి ఉన్న ప్రతిబంధకాలను తొలగించే లక్క్ష్యంతో ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు పేర్ని నాని, పువ్వాడ అజయ్ ఈనెల 14న (సోమవారం) హైదరాబాద్‌లో సమావేశం కానున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ఇటీవల లాక్డౌన్ ఎత్తివేడంతో ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమైనప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మాత్రం ప్రారంభం కాలేదు. దీనిపై ఇరు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇరు రాష్ట్రాల నుంచి సమానంగా సర్వీసులు నడపాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో నిలిచిపోయిన చర్చలను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు మరోసారి సిద్ధమవుతున్నాయి. (రైలు ప్రయాణికులూ...ఇవి పాటించాలి..) -
ఆ ప్రయాణాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇకపై డీజీపీ కార్యాలయం నుంచి పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అంతరాష్ట్ర ప్రయాణాలకు డీజీపీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. (ప్రధాని మోదీకి కేసీఆర్ ఘాటు లేఖ) కాగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం అంతర రాష్ట్ర ప్రయాణాలకు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్ పోర్ట్ పాసులను జారీ చేయడాన్ని పోలీసు శాఖ నిలిపి వేసింది. తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా వాహన పాసులను అడగడం లేదు. అయితే ఆంద్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన వారు స్పందన యాప్‌లో, కర్ణాటకకు వెళ్లేవారు ఆ రాష్ట్రానికి చెందిన సేవా యాప్‌లోనూ, మహారాష్ట్రకు వెళ్లేవారు ఆ రాష్ట్ర పోర్టల్‌లో ప్రయాణికుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. (సెల్లో ఫొటోలు తీసి... ఆపై గర్భవతిని చేసి) -
ఆర్టీసీ సర్వీసులపైనే పీటముడి
- కొలిక్కిరాని రవాణా మంత్రుల చర్చలు - ఖరారుకాని అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందం - మళ్లీ హైదరాబాద్‌లో భేటీకి నిర్ణయం - అప్పటికి ‘అంతర్రాష్ట్ర’ ఒప్పందం కొలిక్కి వస్తుందని ఆశాభావం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రవాణా శాఖల మంత్రుల మధ్య బుధవారం విజయవాడలో ఓ ప్రైవేటు హోటల్లోని జరిగిన సమావేశం ఎటువంటి ఫలితాన్నివ్వలేదు. ఉభయరాష్ట్రాల మధ్య మూడేళ్లుగా నలుగుతున్న అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందం కొలిక్కిరాలేదు. సరికదా ఆర్టీసీ సర్వీసులపై పీటముడి పడింది. ఏపీ, తెలంగాణల రవాణా మంత్రులు అచ్చెన్నాయుడు, మహేందర్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు సుమితా దావ్రా, సునీల్‌శర్మ, ఏపీ రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, ఆర్టీసీ ఎండీలు మాలకొండయ్య, రమణరావులు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానం అమలు, ఆర్టీసీ సర్వీసులపై ప్రధానంగా చర్చించారు. విభజనానంతరం రెండు రాష్ట్రాలమధ్య రవాణారంగ వాహనాలు, ప్రైవేటు బస్సులపై పరస్పర ఒప్పందం జరగలేదు. అప్పటి నుంచి అంతర్రాష్ట్ర పర్మిట్ల విధానం తెరపైకొచ్చి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో అధికారులు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తాత్కాలిక పర్మిట్లతోనే రవాణా సాగుతోంది. సింగిల్ పర్మిట్ విధానం అమలుపై ఇరు రాష్ట్రాల రవాణా అధికారుల మధ్య పలు మార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. తాజా భేటీలోనూ ఆర్టీసీ సర్వీసుల విషయంలో అభిప్రాయ భేదాలు కొనసాగినట్టు సమాచారం. ఏపీ సర్వీసులు తెలంగాణలో 700 తిరుగుతుంటే, తెలంగాణ సర్వీసులు 400 మాత్రమే తిరుగుతున్నాయంటూ మంత్రి మహేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.హైదరాబాద్‌కు బస్సులు నడపడం వల్లే ఏపీఎస్ఆర్టీసీకి ప్రధానంగా ఆదాయం సమకూరుతోందని, అందువల్ల సర్వీసులను తగ్గించుకోవడం సాధ్యపడదని ఏపీ ఆర్టీసీ అధికారులు వాదించారు. అయితే ఆర్టీసీ సర్వీసుల విషయంలో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల స్థాయిలో గురువారం చర్చలు జరపాలని తాజా భేటీలో నిర్ణయించారు. రవాణారంగ సమస్యలపై 5 అంశాలు చర్చకొచ్చాయని, 4 అంశాలపై సానుకూలంగా అభిప్రాయాలు వ్యక్తమైనట్లు రవాణాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. నెలాఖరు లేదా వచ్చే నెల మొదటివారంలో మళ్లీ భేటీ.. సమావేశానంతరం రెండు రాష్ట్రాల రవాణా మంత్రులు అచ్చెన్నాయుడు, మహేందర్‌రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ.. సరుకు రవాణా వాహనాలు, కాంట్రాక్టు క్యారేజీ బస్సుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ఈ నెలాఖరు లేదా వచ్చేనెల మొదటి వారంలో హైదరాబాద్‌లో మరలా భేటీ అవుతామని, అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటించారు. ఆర్టీసీలో పనిచేస్తున్న సిబ్బందిలో చాలామంది.. భార్య ఓ రాష్ట్రంలో భర్త మరో రాష్ట్రంలో పనిచేస్తున్నారని, వీరి సమస్యతోపాటు స్థానికతపై చర్చించామని అచ్చెన్నాయుడు వివరించారు. ఆర్టీసీ సర్వీసులపై లోతుగా చర్చించి పరిష్కార అమలుకు మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులను కొంతమేరకు కుదించి, తెలంగాణ సర్వీసులు పెంచుకునేలా సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తామని చెప్పారు. మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆర్టీసీ రూట్ల విషయంలో జూన్‌లో పునఃసమీక్ష జరుగుతుందని, అప్పటివరకు యథాస్థితి కొనసాగించాలని ఏపీ ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య కోరారు. ఆ సమీక్షలో సర్వీసుల కుదింపు, పొడిగింపుపై నిర్ణయం తీసుకుందామని సూచించారు.