జల్లికట్టు ‘హింస’పై దర్యాప్తు కమిషన్
- విధ్వంసకారులను వదిలిపెట్టం: సీఎం సెల్వం
చెన్నై: జల్లికట్టు ఉద్యమం సమయంలో విధ్వంసానికి పాల్పడినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేదిలేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్ సహా పలు జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాయుత ఘటనల్లో నిందితులను గుర్తించి, శిక్షిస్తామని చెప్పారు. నాటి హింసాకాండపై దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.
‘హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వం వహించే దర్యాప్తు కమిషన్.. నేటి నుంచి వారంలోగా నివేదికను సమర్పింస్తుంది. ఆ నివేదికలోని అంశాల ఆధారంగా విధ్వంసకారులపై చర్యలు తీసుకుంటాం’అని సీఎం పన్నీర్ సెల్వం తెలిపారు. నాటి ఘటనల్లో చెన్నైకి చెందిన 21 మంది విద్యార్థులను, ఇతర జిల్లాలకు చెందిన మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారని, వారిని విడుదల చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సీఎం తెలిపారు.
ఆటోలకు నిప్పుపెట్టింది పోలీసులేనా?
జల్లికట్లు ఆందోళన హింసాయుతంగా మారిన తర్వాత.. పోలీసులే ఆటోలకు నిప్పు పెట్టినట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ రేపిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను లింక్ చేస్తూ పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే ఖాకీ దుస్తుల్లో ఆటోకు నిప్పుపెట్టినవాళ్లు నిజం పోలీసులుకాదని తమిళనాడు హోం శాఖ ఒక ప్రకటన చేసింది. దీంతో ఈ వ్యవహారం గందరగోళంగా మారింది. కాగా, ఈ వీడియోలను కూడా దర్యాప్తు కమిషన్ పరిశీలించనుందని, ఆటోలకు నిప్పుపెట్టింది పోలీసులేనని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు.