ఐఫోన్ ఎత్తుకెళ్లాడు.. నంబర్లు పంపాడు!
దొంగల్లోనూ మంచోళ్లు ఉంటారని నిరూపించాడు ఓ చైనా దొంగ. తాను కొట్టేసిన ఐఫోన్లోని సమాచారాన్ని బాధితుడికి పంపి కొంచెం మంచోడనిపించుకున్నాడు. అయితే ఫోన్ మాత్రం వెనక్కి పంపలేదండోయ్. జిన్హువా వార్తా సంస్థ ఈ కథనాన్ని వెల్లడించింది.
చైనాలోని సెంట్రల్ ప్రావిన్స్ హునన్కు చెందిన జో బిన్.. షేరింగ్ టాక్సీలో ప్రయాణిస్తూ తన యాపిల్ ఐఫోన్ పోగొట్టుకున్నాడు. తన ఫోన్ చోరీకి గురైందని గుర్తించి దొంగకు ఒక టెక్ట్స్ మెసేజ్ పంపాడు. తన ఫోన్లో ఉన్న నంబర్ల బ్యాకప్ లేదని, దయచేసి ఐఫోన్ తిరిగిచ్చేయాలని కోరాడు. ఫోన్ తన అడ్రస్కు పంపాలని అందులో విజ్ఞప్తి చేశాడు.
కొద్దిరోజుల తర్వాత తనకు అందించిన ప్యాకేట్ చూసి జో బిన్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఫోన్లో ఉన్న 1000 నంబర్లను చేతితో రాసిన 11 పేజీలు అందులో ఉండడం చూసి అతడు అవాక్కయ్యాడు. అయితే దొంగిలించిన ఐఫోన్ మాత్రం పంపలేదు. ఫోన్లో సేవ్ చేసిన నంబర్లు, వారి పేర్లు స్వదస్తూరీతో రాశానని జో బిన్కు సందేశంలో దొంగ పేర్కొన్నాడు.