ఐదు మృతదేహాలు లభ్యం: ఇరానీ
మండి: హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటనలో ఇప్పటివరకు ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. గల్లంతైన మరో 19 మంది కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు. ఘటనాస్థలానికి 20 కిలోమీటర్ల దిగువన మృతదేహాలు లభ్యమయినట్టు వెల్లడించారు.
విద్యార్థులు కొట్టుకుపోయిన సంఘటనా స్థలాన్ని ఆమె పరిశీలించారు. సహాయక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని ఇరానీ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ విద్యామంత్రి బాలి, విజ్ఞానజ్యోతి కళాశాల ప్రినిపాల్ తో మాట్లాడినట్టు వెల్లడించారు. అవసరమైన సాయం అందిస్తామని చెప్పినట్టు తెలిపారు. గల్లంతైన వారు క్షేమంగా బయటపడాలన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.