ఆరు ప్రభుత్వ సైట్లను హ్యాక్ చేసిన ఉగ్రవాదులు
బ్యాంకాక్: ఇప్పటి వరకు భౌతిక దాడులకు దిగుతున్న ఉగ్రవాదులు ఇప్పుడు సాంకేతిక పరమైన దాడులకు దిగుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బ్యాంకాక్కు చెందిన ఆరు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లను హ్యాక్ చేసింది. ట్యునీషియా నుంచి ఈ చర్యకు పాల్పడింది. ఈ సైట్లను తెరిచి చూసేవారికి రోహింగ్యా ముస్లింల చిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఫల్లాగ్ గస్సిర్ని అండ్ డాక్టర్ లామౌచి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
మీ సైట్లను ట్యునిషియా నుంచి తామే హ్యాక్ చేశామని అందులో పేర్కొన్నారు. 'మీరు మా ప్రజలకు గౌరవం ఇవ్వాలి. మాదంతా ఫల్లాగా బృందం. మొత్తం ముస్లింలమే. మేము శాంతియుతంగా ప్రజలను ప్రేమిస్తాం' అని కూడా అందులో పేర్కొన్నారు. గతంలో కూడా వీరే ఇజ్రాయెల్, ప్రెంచ్ సైట్లపై హ్యాకింగ్కు పాల్పడ్డారు. దీనిపై థాయిలాండ్ సాంకేతిక శాఖ మంత్రి స్పందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ సైట్లపై హ్యాకింగ్ దాడులు జరగడం సర్వ సాధారణమైందని, సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు.