
ఆందోళనలో పాల్గొన్న రాఘవ లారెన్స్
చెన్నై: జల్లికట్టుపై నిషేధం తొలగించాలని తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యహారంలో జోక్యం చేసుకునేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. జల్లికట్టు అంశం సుప్రీంకోర్టులో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
మరోవైపు జల్లికట్టుపై నిషేధం తొలగిస్తూ ఆర్డినెన్స్ తేవాలని అన్నాడీఎంకే ఎంపీలు రేపు ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. ఇంతకుముందు ప్రధానమంత్రి మోదీని కలిసేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జల్లికట్టుకు మోదీ ప్రభుత్వం అనుకూలంగా ఉందని తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు. ప్రజల ఆందోళనలను అర్థం చేసుకోగలమని, జల్లికట్టు అంశం సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు.
తమిళ ప్రజల మనోభావాలను గౌరవించాలని డీఎంకే నాయకురాలు కనిమొళి అన్నారు. జల్లికట్టుకు మద్దతుగా ఒక్క చెన్నైలోనే కాదని, రాష్ట్రమంతా ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు.