బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు సీఎం జయలలితను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై అప్పీలుకు వెళ్లాలని కర్ణాటక మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని సీఎం తనకు సూచించినట్లు భేటీ అనంతరం న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. న్యాయశాఖ, ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్‌పీపీ) బీవీ ఆచార్య, అడ్వొకేట్ జనరల్ ఇప్పటికే అప్పీలుకు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. సుప్రీంలో కూడా ఎస్‌పీపీగా ఆచార్య కొనసాగుతారని వివరించారు.
19 ఏళ్లపాటు సాగిన ఈ కేసులో కర్ణాటక హైకోర్టు మే 11న జయను నిర్దోషిగా ప్రకటించడంతో అదేనెల 23న ఆమె మళ్లీ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూడా కర్ణాటకపై ఒత్తిడి తెచ్చింది. తీర్పును సవాలు చేయాలని కర్టాటక తీసుకున్న నిర్ణయాన్ని తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే, కాంగ్రెస్, పీఎంకేలు ఆహ్వానించాయి. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇలగోవన్ పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఇంతకుముందే తీసుకుంటే జయ సీఎం పగ్గాలు చేపట్టేవారు కాదని పీఎంకే అధినేత ఎస్.రాందాస్ వ్యాఖ్యానించారు.
జయ కేసుపై సుప్రీంకు..
Published Tue, Jun 2 2015 2:55 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement